పాత ఢిల్లీలో నీటి కటకట | water Problems in Old Delhi Shahdara | Sakshi
Sakshi News home page

పాత ఢిల్లీలో నీటి కటకట

Dec 12 2013 11:17 PM | Updated on Sep 2 2017 1:32 AM

ఎన్నికల్లో మెజార్టీ సాధించి పార్టీలు నువ్వంటే..నువ్వంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓవైపు తాత్సారం చేస్తున్నాయి.

సాక్షి, న్యూఢిల్లీ:ఎన్నికల్లో మెజార్టీ సాధించి పార్టీలు నువ్వంటే..నువ్వంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓవైపు తాత్సారం చేస్తున్నాయి. మరోవైపు ఢిల్లీలో పాలన స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత ఢిల్లీలో తాగునీటి కటకటతో అల్లాడుతున్నారు. పదిరోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీరు రావడం లేదు. సమస్య ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులను అడిగితే జల్‌బోర్డుకి చెందిన మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నందునే మంచినీరు అందడం లేదని సమాధానం చెబుతున్నారు. పాత ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్, లక్ష్మినగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లలిత్‌పార్క్, శీశ్‌గార్డెన్ ప్రాంతాలవారు చెబుతున్న ప్రకారం రెండు రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. మరో రెండు రోజుల వరకు మంచినీటి ట్యాంకులను శుభ్రంచేసే పనులు కొనసాగనున్నందున నీటి ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. అప్పటివరకు పట్‌పర్‌గంజ్, పాత పశ్చిమ వినోద్‌నగర్,గాజీపూర్ గ్రామంలోని వివిధ ప్రాంతాలపై ఈ ప్రభావం ఉంటుందన్నారు.
 
 షహదరాలో పది రోజులుగా సమస్య:
 షహదరాలోని బోలానాథ్‌నగర్‌లో కొన్ని రోజులుగా మంచినీటి కటకట నెలకొంది. ఈ ప్రాంతంలో ఇంటర్‌నెట్ కేబుల్ వేసేందుకు గోతులు తీస్తుండడంతో తాగునీటి పైప్‌లైన్లు పగిలిపోయాయి. వీటిని మరమ్మతు చేయడంలో జల్‌బోర్డు అధికారుల జాప్యంతో తాగునీటి సరఫరా పది రోజులుగా పూర్తిగా నిలిచిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 మరమ్మతుల కారణంగానే ఇబ్బందులు: ఎస్‌కే చౌహాన్, జల్‌బోర్డు అధికారి
 పాత ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లో మీటర్లు బిగిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు. దీనిపై స్థానికులకు ముందే సమాచారం అందించాం. చలికాలం కావడంతో ఇప్పుడు ఈ పనులు ప్రారంభించాం. అత్యవసరం ఉన్న ప్రాంతాలకు ఫోన్‌లో సమచారం ఇస్తే ట్యాంక ర్లను పంపుతున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement