
103 ఏళ్లయినా సీఎం అవుతా..
తమిళ రాజకీయాల్లో కురువృద్ధుడిగా 103 ఏళ్లకూ ముఖ్యమంత్రిగా పాలించేందుకు సిద్ధమని డీఎంకే అధినేత కరుణానిధి దీమా వ్యక్తం చేశారు.
* డీఎంకే అధినేత కరుణానిధి ధీమా
* తొలి సంతకం మద్యనిషేధంపైనే
* విల్లుపురంలో ఎన్నికల ప్రచారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళ రాజకీయాల్లో కురువృద్ధుడిగా 103 ఏళ్లకూ ముఖ్యమంత్రిగా పాలించేందుకు సిద్ధమని డీఎంకే అధినేత కరుణానిధి దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన వయసు 93 ఏళ్లు ఒక లెక్కకాదని చెప్పారు. కరుణానిధి తిరుచ్చి నుంచి వ్యాన్‌లో గురువారం మధ్యాహ్నం ఉళుందూర్‌పేటకు చేరుకున్నారు. ఆయన వ్యాన్‌లో నుంచే ప్రచారం చేశారు.
ఆ తరువాత రాత్రికి విళుపురంలో ప్రచారం చేశారు. ఈ సభల్లో కరుణానిధి మాట్లాడుతూ డీఎంకేను ఎవ్వరూ రూపుమాపలేరు, కనీసం ఈ మాటలు కూడా అనలేరని అన్నారు. డీఎంకే అనుకుంటే సాధించి తీరుతుందని ఈ ఎన్నికల్లో నిరూపిస్తానని చెప్పారు. 93 ఏళ్ల వయసులో ఇలా శ్రమపడాల్సిన అవసరం ఉందా అని ఎందరో ప్రశ్నిస్తున్నారు, 103 ఏళ్ల వయసులో కూడా ప్రజల కోసం పనిచేస్తాను, పాటుపడతానని అన్నారు. ఈ వృద్ధాప్యంలో కూడా తన తాపత్రయం పదవులు, ప్రభుత్వం కోసం కాదు, ప్రజల కోసమేనని చెప్పారు. తనను ప్రాణంగా చూసుకునే ప్రజలను అన్నాడీఎంకే ప్రభుత్వం నుంచి కాపాడడం తన కర్తవ్యమని అన్నారు.
తానొక్కడినే కాదు ప్రజలందరూ ఏకమై రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే ఐదేళ్ల పాలనలో రాష్ట్రం శ్మశానంలా మారిందని, ప్రజా సంక్షేమ పట్టని పాలకుల వల్లనే ఈ దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యువతను ఎక్కువగా నమ్ముతున్నాను, ఈ రాష్ట్రానికి వారే వెన్నెముక, ఎముకలు, నరాలు అన్నారు. యువత తలచుకుంటే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సులువగా పారద్రోలగల రని పేర్కొన్నారు.
సంపూర్ణ మద్య నిషేధం ఉందా అని జయలలిత ప్రశ్నిస్తున్నారు, మద్య నిషేధం అంటేనే సంపూర్ణమని ఆమెకు చెప్పాల్సి వచ్చిందని తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అంటున్నారు, అంటే ఆలోచించి ఆలోచించి అమలు చేస్తారా అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు నేనొక వాగ్దానం చేస్తున్నాను, డీఎంకే ప్రభుత్వం ఏర్పడగానే నా తొలి సంతకం మధ్య నిషేధంపైనేనని కరుణానిధి చెప్పారు. అంతేకాదు మద్యం తాగేవారికి జైలు శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు.
93 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం పోరాటం : కనిమొళి
డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 93 ఏళ్ల వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమైనారని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అన్నారు. వేలూరులో గురువారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ ఐదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన జయలలిత ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏనాడైనా బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. పాలనను పక్కనపెట్టి విశ్రాంతి తీసుకునేందుకే సమయమంతా సరిపోతోందని ఎద్దేవా చేశారు. తమిళనాడును ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఒక్క డీఎంకేకు మాత్రమే సాధ్యమని చెప్పారు.