ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై పెరుగుతున్న విమర్శల తీవ్రత | The intensity of the growing criticism on adarsh housing society scam | Sakshi
Sakshi News home page

ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంపై పెరుగుతున్న విమర్శల తీవ్రత

Dec 27 2013 12:14 AM | Updated on Jul 26 2019 5:53 PM

రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణ దర్యాప్తు నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి, ముంబై: రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణ దర్యాప్తు నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సొంత పార్టీకి చెందిన నేత, కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ట్విట్టర్ స్పందిస్తూ ఆదర్శ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని పోస్టు చేయడం ఆ పార్టీలో కలకలానికి దారి తీసింది. ఇదే బాటలో మరికొందరు నాయకులు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే పరిస్థితి ఏంటా అని అగ్రనాయకులు కలవరపడుతున్నారు. దీనికి తోడు ఆదర్శ్ నివేదికను సీఎం పృథ్వీరాజ్ చవాన్ నిరాకరించాడని, తమకేమీ సంబంధం లేదని మిత్రపక్ష పార్టీ ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టినట్లయ్యింది.

 పెరుగుతున్న విమర్శల తీవ్రత
 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. ఈ కేసులో కాంగ్రెస్‌కు చెందిన ‘ముఖ్య’నేతల పేర్లు ఉండటంతో అగ్నికి అజ్యం పోసినట్టైంది. ఇదేనా ‘ఆదర్శ’వంతమైన పాలనా అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రూ.కోట్లలో విలువచేసే ప్లాట్లను అధికార దుర్వినియోగంతో తక్కువ రేట్లకే బంధువులకు దోచిపెట్టడమేనా అని మన ‘ముఖ్య’నేతల సంస్కృతి అన్న విమర్శల దాడి పెరుగుతోంది. ఆదర్శ్ కుంభకోణంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, ఆశోక్ చవాన్, సుశీల్ కుమార్ షిండేలతో పాటు పలువురు మంత్రుల ప్రమేయంపై రూపొందించిన ద్విసభ్య కమిషన్ విచారణ నివేదికను గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌తో పాటు శాసనసభలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తోసిపుచ్చడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఈ కేసులో మాజీ సీఎం ఆశోక్ చవాన్‌ను సీబీఐ విచారించేందుకు గవర్నర్ కె.శంకర్ నారాయణన్ నిరాకరించడంతో ఇక ఈ కేసు నీరుగారినట్టేనని అందరూ భావించారు. అయితే నాగపూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆదర్శ్ నివేదికను ప్రవేశపెట్టాల్సిందేనని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశాయి. తప్పనిసరి పరిస్థితుల్లో శాసనసభలో సర్కార్ ప్రవేశపెట్టింది. ప్రజాహితం దృష్ట్యా ఈ నివేదికను తిరస్కరిస్తున్నామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. మిస్టర్ క్లీన్ అని పేరున్న చవాన్ ఈ ప్రకటనతో అవినీతి బురదను తనకు అంటించుకునే సాహసం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడే ఇదే విషయమై సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు వస్తుండటం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది.

 ముఖ్యంగా ముఖ్యమంత్రి పృ థ్వీరాజ్ చవాన్‌కు రాబోయే రోజుల్లో ఆదర్శ్ మరింత తలనొప్పిగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడైన మిలింద్ దేవరా ఆదర్శ్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని సూచించారు.రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన మిలింద్ దేవరా ఇలా సొంత పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడంపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరోవైపు  మిలింద్ వ్యాఖ్యలు ప్రతిపక్షాల వాదనలను మరింత బలం చేకూర్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదర్శ్ నివేదకను తోసిపుచ్చడంపై నిరసన వ్యక్తం చేస్తూనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని మిలింద్ తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.

 తోసిపుచ్చింది ముఖ్యమంత్రే: అజిత్ పవార్
 ఆదర్శ్ నివేదికను సభలో తోసిపుచ్చాలన్న నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవానేనని, ఆ నిర్ణయంతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఆదర్శ్ అంశం ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారే అవకాశాలున్నాయి. ఆదర్శ్ దర్యాప్తు నివేదికను తోసిపుచ్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న నిరసనల నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎన్సీపీ తమకు సంబంధంలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక నుంచి ఈ అంశంపై ఎన్సీపీ ఆచితూచి అడుగు ముందుకువేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
 మళ్లీ పరిశీలిస్తే మద్దతిస్తాం
 ఆదర్శ్ విచారణ నివేదికను తిరస్కరించిన నిర్ణయాన్ని మళ్లీ పరిశీలిస్తే సీఎం చవాన్‌కు మద్దతిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ గురువారం మీడియాకు తెలిపారు. హౌసింగ్ కుంభకోణంలో ఎన్సీపీ మంత్రులు సునీల్ తట్కరే, రాజేశ్ తోపేల పాత్ర ఏమీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement