రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా పలు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా వ్యవహరించనుండగా, మరికొన్నిచోట్ల తమదైన ముద్రనువేసుకోనున్నారు.
షోలాపూర్, న్యూస్‌లైన్:రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా పలు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా వ్యవహరించనుండగా, మరికొన్నిచోట్ల తమదైన ముద్రనువేసుకోనున్నారు. షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గం తెలుగువారి అధీనంలోనే ఉండేది. ఇక్కడ నివసించేవారిలో సుమారు 50 శాతం మంది తెలుగు ప్రజలే.
ఈ నియోజక వర్గంలో మొత్తం ఆరు సెగ్మెంట్‌లున్నాయి. షోలాపూర్ సెంట్రల్, షోలాపూర్ నార్త్, షోలాపూర్ సౌత్ సెగ్మెంట్లలో మెజారిటీ ఓటర్లు తెలుగు ప్రజలే. దీంతో ఇక్కడ తెలుగువారి ఓట్లే కీలకంగా మారాయి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగువారైన గంగాధర్ కూచన్, ధర్మన్న సాదుల్, లింగరాజు వల్యాల్‌లు ఐదు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు. దీంతో సుమారు 25 సంవత్సరాలపాటు తెలుగు వారే ఎంపీలుగా గెలుపొందారు.
అయితే గత ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో ఈ నియోజకవర్గం ఎస్‌సీ కోటాలోకి వెళ్లింది. ఇలా జరగడం తెలుగువారు ప్రాతినిధ్యం వహించే అవకాశానికి గండికొట్టింది.మరోవైపు తెలుగువారిలో ఐక్యత లోపించడంతో అది ఇతరులకు అవకాశం దక్కేలాచేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు ఓటర్ల మనోభావాలను ‘సాక్షి’ తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఉత్తర షోలాపూర్ శాసనసభా నియోజకవర్గంలో నివసిస్తున్న తెలుగువారి సమస్యలను తెలుసుకునేందుకు ‘న్యూస్‌లైన్’ ప్రయత్నించింది. ఎన్నికల నేపథ్యంలో వారు ఏమి కోరుకుంటున్నారు..? ఎలాంటి సమస్యలున్నాయి? తదితరాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.