సందిగ్ధంలో ‘బాబు’ సేన | TDP to tap Telugus in Karnataka | Sakshi
Sakshi News home page

సందిగ్ధంలో ‘బాబు’ సేన

Published Sun, May 17 2015 3:19 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

టీడీపీ వర్గాలకు ముచ్చెమటలు పట్టించే పనిలో తమిళర్ మున్నేట్ర కళగం (టీఎంకే) నేతలు నిమగ్నం అయ్యారు. ఆ పార్టీ సమావేశానికి

సాక్షి, చెనై :టీడీపీ వర్గాలకు ముచ్చెమటలు పట్టించే పనిలో తమిళర్ మున్నేట్ర కళగం (టీఎంకే) నేతలు నిమగ్నం అయ్యారు. ఆ పార్టీ సమావేశానికి అనుమతి ఇవ్వొద్దని కమిషనర్‌కు శనివారం విజ్ఞప్తి చేశారు. ఇది కాస్త టీడీపీ వర్గాల్ని సందిగ్ధంలో పడేస్తోంది. జాతీయ పార్టీగా ఆవిర్భావం నినాదంతో  తమిళనాట టీడీపీని విస్తరించేందుకు చంద్రబాబు నాయుడుకుస్తీలు పడుతున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఓ కమిటీని సైతం ప్రకటించారు. ఈ కమిటీకి అధినేత వారసుడు లోకేష్ తన మార్క్‌ను చాటుకునే రీతిలో హైదరబాద్ వేదికగా  ఉపదేశాలు చేసి పంపించారు.  ఈ కమిటీ తొలి సమావేశం చెన్నైలో ఇటీవల జరిగింది. బలోపేతం లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తులు మొదలెట్టారు.  ఇందు కోసం పార్టీ వర్గాలు,అభిమానులు ఏకం కావాలని పిలుపు నిచ్చారు.
 
 ఆదివారం చెన్నైలో ఓ వేదికను ఎంపిక చేసుకుని సమావేశానికి కసరత్తులు చేపట్టినా, అది కాస్త తమిళర్ మున్నేట్ర కళగం రూపంలో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎన్‌కౌంటర్ పేరుతో 20 మంది తమిళులను బలిగొన్న చంద్రబాబు పార్టీకి ఇక్కడ చోటు లేదంటూ తమిళాభిమాన సంఘాలు స్వరం పెంచి ఉండడంతో ఆ తేదీని ఈనెల 22కు మార్చుకున్నట్టుంది. తేదీలు మారినా, వేదికలు మార్చుకున్నా, వదలి పెట్టే ప్రసక్తే లేదన్నట్టుగా తమిళర్ మున్నేట్ర కళగం వర్గాలు టీడీపీని వెంటాడే పనిలో పడ్డాయి. తమిళనాడులో  ఆ పార్టీ సమావేశానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని ఏకంగా చెన్నై పోలీసు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశాయి.
 
 అనుమతి ఇవ్వొద్దు: తమిళర్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఆదియమాన్, కార్యదర్శి రాజ్‌కుమార్‌ల నేతృత్వంలోని బృందం ఉదయం కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశాయి. కమిషనర్ జార్జ్‌కు విన్నవిస్తూ తమ విజ్ఞాపనా పత్రాన్ని అందజేశాయి. ఇందులో శేషాచలంలో అమాయక తమిళుల్ని ఎన్‌కౌంటర్ పేరుతో బలి తీసుకొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తీరును వివరించారు. ప్రజా స్వామ్య దేశంలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే పార్టీని పెట్టుకోవచ్చని సూచిస్తూ, టీడీపీ మాత్రం ఆ అర్హతను కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిట్టల్లా తమిళుల్ని కాల్చి చంపి,  ఆ రక్తపు మరకలు ఆరక ముందే, తమిళనాడులో పాదం మోపేందుకు సిద్ధం అవుతూ, పుండు మీద కారం చల్లే ప్రయత్నాల్లో ఉన్నారని వివరించారు.
 
  తమిళులకు వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్లకు ఇక్కడ చోటు లేదని, అలాంటి పార్టీ సమావేశానికి ఇక్కడ ఎలాంటి అనుమతి ఇవ్వొద్దని విన్నవించారు. అనుమతులు ఇచ్చిన పక్షంలో తమిళాభిమానుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకోవడం ఖాయం అని పేర్కొన్నారు. దీంతో స్పందించిన కమిషనరేట్ వర్గాలు విచారణకు సిద్ధం అయ్యాయి.
 సందిగ్దంలో టీడీపీ వర్గాలు: పార్టీ బలోపేతం లక్ష్యంగా హైదరాబాద్‌లో ప్రగల్బాలు పలికి వచ్చిన నాయకులకు తమిళర్ మున్నేట్ర కళగం ముచ్చెమటలు పట్టిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు రూపంలో ఈనెల 22వ తేదిన జరగాల్సిన సమావేశాన్ని సైతం వాయిదా వేసుకునే పనిలో పడ్డట్టున్నారు. తమకు అందిన ఫిర్యాదుపై విచారణను పోలీసులు వేగవంతం చేసినట్టు సమాచారం. టీడీపీ వర్గాలు ఎంపిక చేసుకున్న వేదిక వద్దకు వెళ్లి పోలీసులు విచారించి ఉన్నారు. సమావేశానికి  తమ అనుమతి కోరని దృష్ట్యా, ఆ వేదిక నిర్వాహకుల్ని తీవ్రంగా హెచ్చరించి వెళ్లి ఉన్నారు.
 
 తమ ఆదేశం లేకుండా టీడీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వొద్దని హెచ్చరించి వెళ్లి ఉన్నారు. ఈ పరిణామాలతో సందిగ్దంలో పడ్డ బాబు సేన తదుపరి కార్యచరణకు సిద్ధం అవుతున్నది. తమిళాభిమాన సంఘాల్ని బుజ్జగించేందుకు అన్నదమ్ముల అస్త్రం ప్రయోగించే పనిలో తెలుగు తంబీలు సిద్ధం అయ్యారు. తెలుగు, తమిళ భాషా భేదాలు లేకుండా అన్నదమ్ముల్లా కలసి ముందుకు సాగుదామని , తమతో కలసి రావాలని తమిళాభిమాన సంఘాలకు బాబు సేన విజ్ఞప్తి చేసే పనిలో పడింది. తమిళాభిమాన సంఘాల ఆగ్రహంతో టీడీపీ సభ్యత్వ నమోదు శ్రీకారం మరెన్ని వాయిదాల పర్వంతో ముందుకు సాగుతోందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement