వలస కార్మికుల నమోదుపై సమావేశం

sp conduct special drive and plan to recognise Migrant workers - Sakshi

రాయగడ : ఇతర రాష్ట్రాల వ్యాపారులు, పరిశ్రమలు, ఇటుకబట్టీల్లో దళారుల వల్ల మోసపోతూ ఇబ్బందులకు గురవుతున్న వలసకార్మికుల పేర్లు కానీ, చిరునామా కానీ దళారుల పేర్లు కానీ లభించక అటు కార్మికులు ఇటు ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది తెలుసుకున్న రాయగడ జిల్లా పోలీసు అధికారి ఎస్పీ రాహుల్‌ పీఆర్‌ దీనిపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రణాళికను తయరు చేశారు. ఈ మేరకు ఇకపై  కార్మికశాఖ మాత్రమే కాకుండా ప్రతి గ్రామపంచాయతీలో సర్పంచ్, సమితి మెంబర్, వార్డుమెంబర్, ద్వారా గ్రామం నుంచి వలస వెళ్లేవారి పేర్లు, అడ్రస్‌లు, వెళ్లేసమయం, ఏ ప్రాంతానికి వెళ్లేది, మధ్యవర్తి ఎవరు, వారి ఫోన్‌ నంబర్లు నమోదు చేయడం అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికుల వివరాలు నమోదు చేసి పోలీసుల ద్వారా కార్మికశాఖకు అందించే కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్రమాన్ని ఎయిడ్‌ ఈటీ ఏక్షన్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థ  డైరెక్టర్‌ ఉమ్రిడాన్యాల్‌ సహాయంతో   ప్రారంభించారు. ఈ సందర్భంగా రాయగడ జిల్లా కేంద్రంలో కార్మిక చైతన్య కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

చట్టాలపై చర్చ
కార్యక్రమంలో 16పోలీస్‌స్టేషన్‌లు, 32అవుట్‌పోస్టుల అధికారులు, కార్మికశాఖ అధికారులు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు, డీఎస్‌ఎస్‌ విభాగం, చైల్డ్‌లైన్‌ విభాగంతో సహా ఇతర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. సచేతన కార్యక్రమంలో భాగంగా   ముఖ్యంగా ది బాండెడ్‌ లేబర్‌ సిస్టమ్‌ ఎబొలేషన్‌ యాక్ట్‌–1976, ఒడిశా ఇంటర్‌ స్టేట్‌ మైగ్రెంట్‌ వర్క్‌మన్‌ మాన్యువల్‌లో ఉన్న నిబంధనలు, సూచనలు, చట్టపరమైన చర్యలు, వాటికి సంబంధించి చర్చించారు.   జిల్లాలోని కాశీపూర్‌సమితి, రేంగ, టికిరి, చందిలి పంచాయతీ, ముకుందప్రాంతాల నుంచి కేరళ రాష్ట్రానికి వలస కార్మికుల సంఖ్య అధికమని సమావేశంలో తెలియవచ్చింది. ఇంటర్‌స్టేట్‌ మైగ్రేషన్‌ వల్ల ప్రభుత్వం అనేక కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటోందని వివరిస్తూ ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికులకు రాయగడలో దళారులు ఉండగా ప్రధాన కేంద్రం బల్లుగాం అని వివరించారు.

కార్యక్రమంలో ఎస్పీ రాహుల్‌పీఆర్‌ సహా కలెక్టర్‌ గుహపూనాంతపస్‌కుమార్, గుణుపురం ఐటీడీఏ పీఓ    ఘొరచంద్‌గొమాంగో, రాయగడ ఐటీడీఏ పీఓ మురళీధర్‌స్వొంయి, రాయగడ సబ్‌కలెక్టర్‌ ప్రవీర్‌కుమార్‌ నాయక్, గుణుపురం సబ్‌కలెక్టర్‌ అమృతరుతురాజు, డీఎల్‌ఓ ప్రదీప్‌కుమార్‌భొయి ఇతర అధికారులు పాల్గొన్నారు.   
 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top