బైకలాలోని రాణీభాగ్ జూ ప్రవేశ రుసుం పెంచాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) యోచిస్తోంది.
యోచనలో బీఎంసీ నిర్వహణ ఖర్చు పెరిగినందునే..
సాక్షి,ముంబై: బైకలాలోని రాణీభాగ్ జూ ప్రవేశ రుసుం పెంచాలని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) యోచిస్తోంది. కొద్ది నెలలుగా జూ లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు తుది దశకు వచ్చాయి. అందుకు బీఎంసీ పరిపాలన విభాగం రూ. కోట్లు ఖర్చు చేస్తోంది. కొత్త జంతువులను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీంతో నిర్వాహణ భారం పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పర్యాటకుల నుంచి నామమాత్రంగా వసూలు చేస్తున్న ప్రవేశ రుసుంను కొంత శాతం పెంచాలని యోచిస్తోంది. బైకలా తూర్పు ప్రాంతంలో 52 ఎకరాల స్థలంలో ఉన్న ఈ జూ ను 1862లో నిర్మించారు. దీనికి వీరమాత జీజీబాయి భోంస్లే ఉద్యాన్‌గా నామకరణం చేశారు.
అయినప్పటికీ ఇది రాణిభాగ్ పేరుతోనే ప్రఖ్యాతి చెందింది. నిత్యం వందలాది మంది ముంబైకర్లు, పర్యాటకులు ఈ జూను సందర్శిస్తారు. ఇందులో 16 రకాల 140 జంతువులు, 30 రకాల పక్షులు, ఆరు రకాల పాములు ఉన్నాయి. పెద్దలకు ఐదు, పిల్లలకు రెండు, విదేశీ పర్యాటకులకు రూ.10 చొప్పున నామమాత్రంగా ప్రవేశ రుసుం వసూలుచేస్తున్నారు. ఇలా వసూలు చేసిన మొత్తం జంతువులకు, పక్షుల మేత, ఆహారం, జూ సిబ్బంది వేతనాలు, నిర్వహణ తదితరాలకు ఎటూ సరిపోవడం లేదు. దీనికి తోడు ఆధునీకీకరణ పనులు జరిగాయి. జూలోకి విదేశాల నుంచి కొత్త ప్రాణులు, పక్షులు, సర్పాలతోపాటు పెంగ్విన్‌లు రాబోతున్నాయి.
వీటికి రెయిన్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. పెంగ్విన్‌లకు ప్రత్యేక వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. వాటి ఆహారం, ఆరోగ్యం తదితరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకుంటే అవి మరణించే ప్రమాదం ఉంది. దీంతో జూ నిర్వహణ వ్యయం నాలుగు రెట్లు పెరగనుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రవేశ రుసుం పెంచాలని యోచిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో జూ ప్రవేశ రుసుం రూ.40-50 వరకు, విదేశీయులకు రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. ఇదే తరహాలో ముంబైలో కూడా అమలు చేయాలని బీఎంసీ పరిపాలన విభాగం యోచిస్తోంది.