ఇసుక లారీల బంద్

ఇసుక లారీల బంద్


ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నేటి నుంచి ..

 = కొత్త చట్టంతో అనేక సమస్యలు

 = సవరణ చేయాలని సీఎంకు విజ్ఞప్తి  

 = అయినా స్పందన కరువు

 = విధిలేక బంద్ చేస్తున్నాం

 = లారీ యజమానుల వెల్లడి


 

సాక్షి, బెంగళూరు : ఇసుక తరలింపుపై ప్రభుత్వం విధించిన నియమాలు, వివిధ శాఖల అధికారుల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులకు నిరసనగా శనివారం నుంచి ఇసుక లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక లారీ ఓనర్స్ అసోషియేషన్ వెల్లడించింది. ఇదే విషయంపై కొంత మంది లారీల ఓనర్లు శుక్రవారం నుంచే బంద్‌కు పూనుకోగా.. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక లారీ ఓనర్స్ అసోషియేషన్ కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో శనివారం నుంచి పూర్తి స్థాయిలో ఇసుక లారీల సంచారం ఆగిపోనుంది. కాగా శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోషియేషన్ అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ....ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇసుకను సేకరిస్తే జైలు శిక్షను విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని చెప్పారు.



అయితే అదే సందర్భంలో ప్రభుత్వమే ఇసుక పంపిణీని ఎలా నిర్వహిస్తుందనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికను రూపొందించలేదని తెలిపారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే ఇసుకను రవాణా చేయాలని పేర్కొనడం కూడా ఒక అవైజ్ఞానిక చర్యేనని విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఇసుక రవాణా చట్టంతో ప్రతిరోజూ తాము కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.



ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశామని, అయితే ఇప్పటికీ ఆయన స్పందించలేదని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇసుక రవాణా చట్టం శనివారం నుంచే అమల్లోకి వస్తుండడంతో తాము విధిలేక బంద్‌కు దిగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రవాణా చట్టంలో ప్రభుత్వం సవరణలు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది వేల ఇసుక లారీలు బంద్‌లో పాల్గొంటాయని స్పష్టం చేశారు.    

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top