తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా వాసులు మృతిచెందారు.
పాతపట్నం : తూర్పుగోదావరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా వాసులు మృతిచెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారు రాజానగరం వద్ద ఆగి ఉన్న కంటెయినర్ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం చిన్నమల్లిపురం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి శుక్రవారం రాత్రి కారులో బయలుదేరారు. వారి వాహనం రాజానగరం సమీపంలో కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న అప్పలస్వామి(34), గడియ బొద్దు(55) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.