ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 30 యువతుల జీవితాలను నాశనం చేసి, ఒక యువతిని సజీవ దహనం చేసిన మిలన్ సింగ్
30 మంది యువతులపై అత్యాచారం
మరో యువతి సజీవ దహనం
ఫాదర్ ముసుగులో దురాగతాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 30 యువతుల జీవితాలను నాశనం చేసి, ఒక యువతిని సజీవ దహనం చేసిన మిలన్ సింగ్ అనే కీచక ఫాదర్ ఉదంతం పోలీసుల విచారణలో ఆలస్యంగా వెలుగుచూసింది. తిరునెల్వేలి జిల్లా శంకరన్‌కోవిల్‌కు చెందిన ఒక యువతిని ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం చేసి అరెస్టయిన మిలన్ సింగ్ (46) అనే ఫాదర్ బడా మోసగాడు, నేరస్థుడిగా పోలీసుల విచారణలో తేలింది. తిరునెల్వేలి జిల్లా మానూరు ఉక్కిరన్‌కోట్టైకి చెందిన మిలన్ సింగ్ పుట్టుకతో దేవాంగుడు. రామనాథపురం జిల్లా సాయల్‌కుడికి సమీపం నరిప్పయూరిలో ఫాదర్‌గా పనిచేస్తున్నాడు.
ఇతనికి జీవిత (40) అనే భార్య ఉంది. ప్రభుత్వ ఉద్యోగం తీసిస్తానని చెప్పి తిరునెల్వేలి పాలయంగోట్టైకి చెందిన కాంతిమతి (30) నుంచి ఆరునెలల క్రితం రూ.4.5 లక్షలు, 15 సవర్ల నగలు తీసుకున్నాడు. శంకరన్‌కోవిల్‌లో ప్రభుత్వ ఉద్యోగం ఖరారైందని పది రోజుల క్రితం కాంతిమతిని తన వద్దకు పిలిపించుకున్నాడు. శంకరన్‌కోవిల్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో కారు నుంచి తోసివేసి పారిపోయాడు. తనకు జరిగిన మోసం బాధితురాలు కాంతిమతి శంకరన్‌కోవిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిలన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్న సమయంలో ఫాదర్ సాగించిన అనేక దురాగతాలు బైటపడ్డాయి.
తిరునెల్వేలి జిల్లా శంకరన్‌కోవిల్ జేడీ నగర్‌కు చెందిన జ్ఞానం అనే వ్యక్తి కుమార్తె అన్బుసెల్వం (24). ఒక ప్రయివేటు కాలేజీలో చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడు సదరు యువతిని ప్రేమిస్తున్నట్లు నటించి నగలు, నగదు తీసుకుని మోసం చేశాడు. అన్బుసెల్వం నివసిస్తున్న ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తూ వచ్చిన ఫాదర్ మిలన్‌సింగ్‌తో తాను మోసపోయిన విషయం చెప్పుకుని విలపించింది. తాను ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెడుతూ ఓదార్చాడు. అన్బుసెల్వం నుంచి రూ.2లక్షలు వసూలు చేసిన మిలన్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ధర్మపురికి తీసుకెళ్లి రెండేళ్లపాటు తనవద్దనే ఉంచుకుని లైంగికంగా లోబరచుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి అయింది.
ఆమె పెళ్లి చేసుకోవాలని మిలన్‌సింగ్‌ను ఒత్తిడి చేయగా నిరాకరించాడు. అంతేగాక యువతిని హత్యచేసి వదిలించుకోవాలని పథకం పన్నాడు. ఇందుకు భార్య జీవిత సహాయాన్ని కూడా తీసుకున్నాడు. అన్బుసెల్వంను బలవంతంగా అడవి ప్రాంతానికి తీసుకువెళ్లి సజీవదహనం చేసి ప్రాణాలు తీశాడు. శవాన్ని కావేరీపాక్కం కూడలి రోడ్డుపై వేసి వెళ్లిపోయాడు. కుమార్తె కనిపించడం లేదని అన్బుసెల్వం తండ్రి జ్ఞానం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ ఫిర్యాదు వల్ల మిలన్‌సింగ్ సజీవదహనం చేసింది అన్బుసెల్వంనేనని తేలింది.
దీంతో ఫాదర్ భార్య జీవితను సైతం కావేరీపాక్కం పోలీసులు పోలీసు స్టేషన్‌కు పిలిపించుకుని విచారిస్తున్నారు. సదరు ఫాదర్ మిలన్ సింగ్ ఇలానే తిరునెల్వేలి, పాలై, అంబై, వీకే పురం ప్రాంతాలకు చెందిన 30 మంది యువతులను ప్రభుత్వం ఉద్యోగాన్ని ఆశగా చూపి మోసం చేయడం, వీరిలో అనేక యువతులపై అత్యాచారాలు సాగించినట్లు తెలుసుకున్నారు. పాళై సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిలన్‌సింగ్‌ను మరోసారి పోలీసు కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని నేరాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నారు.