రాందాస్‌పై ఒత్తిడి! | PMK founder S Ramadoss Above Pressure | Sakshi
Sakshi News home page

రాందాస్‌పై ఒత్తిడి!

Dec 15 2013 2:44 AM | Updated on Sep 28 2018 7:30 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు పీఎంకే అధినేత రాందాసును ఇరకాటంలో పెడుతున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు పీఎంకే అధినేత రాందాసును ఇరకాటంలో పెడుతున్నాయి. ఇన్నాళ్లు ఒంటరి...ఒంటరి అంటూ వచ్చిన ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం కొత్త పల్లవి అందుకున్నారు. కొత్త ఫ్రంట్ ప్రయత్నాల్ని పక్కన పెట్టి, జతకట్టే మార్గాల్ని అన్వేషించాలని అధినేతపై ఒత్తిడి తెస్తున్నారు. శనివారం తైలాపురంలో జరిగిన ఉత్తర తమిళనాడు జిల్లాల నాయకుల సమావేశం రాందాసును ఆలోచనలో పడేసింది. 
 
 సాక్షి, చెన్నై : వన్నియర్ సంఘం పార్టీగా రూపుదిద్దుకోవడంతో ద్రవిడ పార్టీలకు తన సత్తా ఏమిటో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు గతంలో రుచి చూపించారు. అయితే, ప్రతి ఎన్నికల్లోనూ కూటముల్ని మారుస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంకట పరిస్థితుల్లోకి నెట్టింది. అసెంబ్లీలో  రెండంకెల ఎమ్మెల్యేల్ని కలిగి ఉన్న పీఎంకే, ప్రస్తుతం సింగిల్ డిజిట్‌కు పరిమితం కావాల్సి వచ్చింది. పతనం నేర్పిన గుణపాఠంతో ఇక ద్రవిడ పార్టీలతో కలసి పనిచేయకూడదన్న తుది నిర్ణయానికి ఆ పార్టీ వర్గాలు వచ్చాయి. ఇక తమది ఒంటరి సమరం అని, లేదా తమ నేతృత్వం లోనే కూటమి ఆవిర్భావం జరిగి తీరుతుందన్న ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చారు. ద్రవిడ పార్టీల తీరును దుమ్మెత్తి పోసిన రాందాసు అక్టోబర్‌లో సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్)ను ప్రకటించారు. 
 
 ఇందులో సమాజ హితాన్ని కాంక్షించే ప్రజా సంఘాలు, ద్రవిడ పార్టీలతో ఎలాంటి సంబంధాలు లేకుండా ప్రజల కోసం శ్రమిస్తున్న, ఉద్యమిస్తున్న పార్టీల్ని చేర్చుకోనున్నట్టు ప్రకటించారు. అందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. పుదుచ్చేరితో పాటుగా 40 లోక్‌సభ స్థానల్లో పోటీకి రెడీ అయ్యారు. పదిహేను చోట్ల పోటీకి అభ్యర్థుల చిట్టాను ప్రకటించేశారు. అన్ని పార్టీల కన్నా ముందుగా ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. తమకు పట్టున్న చోట్ల గెలుపు ఖాయం అన్న ధీమాతో ముందుకెళ్తోన్న రాందాసును నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇరకాటంలో పడేశాయి.  ఒంటరి అంటూ, కొత్త ఫ్రంట్ అంటూ వచ్చిన ఆ పార్టీ నాయకులు మనస్సు మార్చుకున్నట్టున్నారు. తమ నేతృత్వంలో కొత్త ఫ్రంట్  ఏర్పాటు చేసి, ఎన్నికల్ని ఎదుర్కొనడం కన్నా జాతీయ పార్టీలతో జత కట్టడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. 
 
 జాతీయ పార్టీలతో పొత్తు: కొత్త ఫ్రంట్ ప్రయత్నాన్ని మానుకుని, జాతీయ పార్టీలతో మంతనాలకు సిద్ధం కావాలన్న ఒత్తిడిని అధినేత రాందాసుపై తెస్తున్నారు. శనివారం తైలాపురం వేదికగా జరిగిన సమావేశంలో నాయకుల ఒత్తిడికి రాందాసు ఉక్కిరి బిక్కిరయ్యూరు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి, విల్లుపురం, కడలూరు, సేలం జిల్లాల నాయకులతో ఎన్నికల ఏర్పాట్లపై రాందాసు సమీక్షించారు. ఆయా జిల్లాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన దృష్ట్యా, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, తమకు ఏ మేరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో ఆరా తీశారు. ఈ సమీక్షలో నాయకులందరూ కొత్త పల్లవి అందుకోవడం రాందాసును ఆలోచనలో పడేసింది. కొత్త ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు చేయడం కన్నా, జాతీయ పార్టీలతో జత కట్టి ఎన్నికల్ని ఎదుర్కొంటే బాగుంటుందన్న అభిప్రాయాల్ని నాయకులు వ్యక్తం చేశారు.
 
 వేచిచూద్దాం: పట్టున్న చోట్ల బలం మరింత పుంజు కుంటోందని వివరించిన ఓ నేత, గెలుపు మాత్రం ఏదో ఒక జాతీయ పార్టీతో కలసి పనిచేస్తే సులభతరం అవుతుందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. దీంతో అందరు నేతలు అదే బాటలో సాగారు. దేశంలో మోడీ ప్రభంజనం మార్మోగుతున్న దృష్ట్యా, బీజేపీతో జత కడితే భవిష్యత్తు ఉంటుందంటూ మెజారిటీ శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో  వేచి చూద్దామం టూ నాయకులకు సర్ది చెప్పారు. మెజారిటీ శాతం మం ది పట్టుబట్టడంతో చివరకు త్వరలో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం దృష్టికి తీసుకెళ్లి, తుది నిర్ణ యం తీసుకుందామంటూ సూచించడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement