హైటెక్‌ సెల్వమ్మ

Old Women Use Solar System For Corn Business - Sakshi

మొక్కజొన్న కంకులు కాల్చడానికి సోలార్‌ యంత్రం

వృద్ధురాలికి ఓ సంస్థ చేయూత

కర్ణాటక ,బొమ్మనహళ్లి : ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందంటూ ఒక మొబైల్‌ సంస్థ తయారు చేసిన ప్రకటన గుర్తుందా..ఈ ప్రకటనల్లో చూపినట్లే యువ ఇంజనీర్‌కు వచ్చిన ఒక ఐడియా ఓ వృద్ధురాలి జీవితాన్ని మార్చేసింది. బెంగళూరు నగరంలో కబ్బన్‌పార్క్‌ ఎంత  ఫేమస్సో పార్కులో మొక్కజొన్న పొత్తులు విక్రయించే సెల్వమ్మ అనే వృద్ధురాలు కూడా అంతే ఫేమస్‌. అంత ఫేమస్‌ ఎందుకుయ్యారంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే..భద్రావతికి చెందిన సెల్వమ్మ చాలా కాలం క్రితం ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా వచ్చే విధానసౌధ, కబ్బన్‌పార్క్‌లో తోపుడిబండి మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు కాల్చడానికి ఏర్పాటు చేసుకున్న కట్టెల పొయ్యి వల్ల సెల్వమ్మ కంకులు కాల్చడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. పదేపదే నిప్పులను వేడి చేయడానికి విసనకర్రను ఊపుతూ ఉండడం సెల్వమ్మకు చాలా కష్టంగా పరిణమించింది.

సెల్వ మ్మ కష్టాన్ని గుర్తించిన సెల్కో సంస్థకు చెందిన యువకుమార్‌ సెల్వమ్మకు చేయూత అందించడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో  వచ్చిన సరికొత్త ఐడియానే ఈ సోలార్‌ సిస్టమ్‌. సౌరశక్తి సహాయంతో మొక్కజొన్న కంకులు కాల్చడానికి వీలుగా అధునాతన సోలార్‌ యంత్రాన్ని తయారు చేసి సెల్వమ్మకు అందించారు. ఈ సోలార్‌ సిస్టమ్‌  ద్వారా మొక్కజొన్నకంకులు కాల్చడంతో పాటు బ్యాటరీ, ఫ్యా న్‌ , ఎల్‌ఇడి బల్బు కూడా పని చేస్తుండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొక్క జొన్న కంకులు విక్రయిస్తుండడంతో సెల్వమ్మ ఆదాయం కూడా రెట్టింపయిం ది. హైటెక్‌ పద్ధతిలో పర్యాటకులకు రుచికరమైన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ ఆదాయం పెంచుకోవడంతో పాటు పొగరహిత పద్ధతిలో మొక్కజోన్న కంకులను కాల్చుతూ పర్యావరణ  రక్షణకు కూడా తన వంతు సహకారం అందిస్తున్న సెల్వమ్మను ఇక్కడికి వచ్చే రోజువారీ వినియోగదారులు హైటెక్‌ సెల్వమ్మగా పిలుచుకుంటున్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top