సత్వర శిక్ష! | Now Minority Girls Rape cases in Fast track court says RR Patil | Sakshi
Sakshi News home page

సత్వర శిక్ష!

Dec 13 2013 12:19 AM | Updated on Jul 28 2018 8:40 PM

సత్వర శిక్ష! - Sakshi

సత్వర శిక్ష!

వికలాంగులు, మతిస్థిమితం లేని, మైనార్టీ బాలికలపై జరిగిన అత్యాచారం కేసుల విచారణ ఇకపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో జరిగేలా చూస్తామని హోంమంత్రి ఆర్‌ఆర్‌పాటిల్ హామీ ఇచ్చారు.

సాక్షి, ముంబై: వికలాంగులు, మతిస్థిమితం లేని, మైనార్టీ బాలికలపై జరిగిన అత్యాచారం కేసుల విచారణ ఇకపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో జరిగేలా చూస్తామని హోంమంత్రి ఆర్‌ఆర్‌పాటిల్ హామీ ఇచ్చారు. అంబేజోగాయి ప్రాంతంలో ఓ వికలాంగ, మైనార్టీ బాలికలపై జరిగిన అత్యాచారం కేసు విచారణ గురించి అసెంబ్లీలో సభ్యులు ఓం ప్రకాశ్ కడు, ప్రవీణ్  దరేకర్, మంగళ్ ప్రభాత్ లోఢా, వివేక్ పండిత్ అడిగిన ప్రశ్నలకు పాటిల్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఈ కేసులకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేశామని, ప్రస్తుతం నిందితులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారని, బాధిత బాలికలకు పునరావసం కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానాల ప్రకారం ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వికలాంగులు, మతిస్థిమితం లేని, చిన్నపిల్లలపై జరిగే అత్యాచార కేసులన్నింటి విచారణ ఫాస్ట్ కోర్టుల ద్వారా చేపట్టడమేగాక వాటి దర్యాప్తును డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ అధికారి స్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తామని పాటిల్ వెల్లడించారు. బాధితులకు అవసరమైతే న్యాయపరమైన సహాయాన్ని కూడా అందిస్తామన్నారు. సముద్ర తీరాల వెంబడి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ ఉద్యోగవకాశాల్లో భూమిపుత్రులకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
 
 దేహూ- కాత్రోజ్ బైపాస్ రోడ్డు పనులు 2014లో పూర్తి...
 పుణే సమీపంలోని దేహూ రోడ్డు నుంచి కాత్రోజ్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ పనులు 2014 డిసెంబరు వరకు పూర్తవుతాయని ప్రజా పనుల శాఖ మంత్రి ఛగన్ భుజబల్ గురువారం అసెంబ్లీలో తెలిపారు.
 
 ఆదర్శ్ రిపోర్డును అసెంబ్లీ ముందుకు తెస్తామని కోర్టుకు చెప్పలేదు: సీఎం
 ఆదర్శ్ కుంభకోణం కేసుకు సంబంధించి దర్యాప్తు కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామంటూ హైకోర్టుకు ఎటువంటి వివరణ ఇవ్వలేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. స్పీకర్ దిలీప్ వల్సే పాటిల్‌కు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపక్ష సభ్యుడు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... ఆదర్శ్ కేసుకు సంబంధించి బీజేపీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరణ ఇచ్చిందని, దర్యాప్తు కమిషన్ రిపోర్డును అసెంబ్లీలో ప్రవేశపెడతామని కోర్టుకు తెలిపిందని, వారం రోజుల్లోగా రిపోర్డును సభలో ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని స్పీకర్‌ను కోరారు. అప్పుడే ప్రతిపక్షాలు ఈ విషయమై చర్చ జరిపే అవకాశముంటుందన్నారు. వారం రోజుల తర్వాత నివేదికను సభ ముందుకు తీసుకొస్తే ఎటువంటి చర్చ జరగకుండానే సభ ముగుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తనకు రాసిన లేఖను స్పీకర్ ఈ సందర్భంగా చదివి వినిపించారు.
 
 క్లస్టర్ల అభివృద్ధిపై నెలలో నిర్ణయం: చవాన్
 ముంబైలో క్లస్టర్ అభివృద్ధి పథకంపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ హామీ ఇచ్చారు. ఠాణే క్లస్టర్ అభివృద్ధి పథకంపై డిమాండ్ చేస్తూ విధాన మండలిలో శివసేన, బీజేపీ, ఎమ్మెన్నెస్‌లు ఆందోళనకు దిగడంతో సభ అరగంటపాటు వాయిదా పడింది. అనంతరం ఇరుపక్షాలు సభ్యులతో స్పీకర్ మాట్లాడడంతో సభ ప్రారంభమైంది. అనంతరం ముఖ్యమంత్రి చవాన్ మాట్లాడుతూ... ఈ విషయమై సబ్-కమిటీ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాటికి అందజేస్తుందని తెలిపారు. ముంబైలో క్లస్టర్ల అభివృద్ధి విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించి, నెలరోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement