దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై రోజురోజుకు జనారణ్యంగా మారుతోంది.
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబై రోజురోజుకు జనారణ్యంగా మారుతోంది. ఇటీవలి కాలంలో ముంబైకి భారీగా వలసలు పెరిగిపోవడంతో ఖాళీ స్థలాలు కనుమరుగవుతున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రతీ మనిషికి సగటున రెండు చదరపు మీటర్ల స్థలం ఉంది. కానీ వలసలు ఇదే రీతిలో కొనసాగితే 1.24 చ.మీ.కు చేరుకోనుంది. ఖాళీ స్థలాలు తగ్గిపోయి, జనసాంద్రత పెరిగిపోతే దాని దుష్ర్పభావం ముంబైకర్ల ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముంబై జనాభా, ఖాళీ స్థలాలపై గట్ నాయకులు తాత్కాలికంగా రూపొందించిన అభివృద్థి మ్యాప్ సీడీని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) కమిషనర్ సీతారాం కుంటే తిలకించారు. నగరానికి నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది వస్తుంటారు. వీరిలో కొందరు ఉపాధి నిమిత్తం, మరికొందరు ఉద్యోగ రీత్యా వచ్చిపోతుంటారు. ఉపాధి కోసం వచ్చిన వారు ఇక్కడే స్థిరపడతారు. నగరంలో ఆకాశహర్మ్యాల నిర్మాణ పనులు, ఫ్లైఓవర్లు, మెట్రో, మోనో లాంటి అనేక కీలక ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. దీంతో క్కడ ఉపాధికి కరువు ఉండదని భావించిన పేదలు, నిరుద్యోగులు గుంపులు గుంపులుగా వచ్చి చేరుతున్నారు.
వీరి కారణంగా నగర పరిసర ప్రాంతాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. మురికివాడలే కాకుండా ఫుట్‌పాత్‌లు, ఖాళీ మైదానాలు కూడా సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణలు, మురికి వాడలు దర్శనమిస్తున్నాయి. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలవడంతో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఏమి చేయలేకపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముంబైలో ఎక్కడ చూసిన జనం, రద్దీ కనిపించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.