పసుపు రైతులను ఆదుకోండి | MP Kavitha request to Union Agriculture Minister for yellow crop | Sakshi
Sakshi News home page

పసుపు రైతులను ఆదుకోండి

May 12 2016 3:16 AM | Updated on Aug 9 2018 4:51 PM

పసుపు రైతులను ఆదుకోండి - Sakshi

పసుపు రైతులను ఆదుకోండి

కనీస మద్దతుధర ప్రకటించే పంటల జాబితాలో పసుపు పంటను కూడా చేర్చి పసుపు రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత..

కేంద్ర వ్యవసాయ మంత్రికి ఎంపీ కవిత విజ్ఞప్తి

 సాక్షి, న్యూఢిల్లీ: కనీస మద్దతుధర ప్రకటించే పంటల జాబితాలో పసుపు పంటను కూడా చేర్చి పసుపు రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఎంపీ కవిత బుధవారం నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలసి రాధామోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణలో పసుపు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు. భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పసుపు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు గతంలో రూ. 16 వేలు ఉన్న పసుపు ధర ప్రస్తుతం రూ. 6 వేలకు పడిపోయినందున కనీస మద్దతు ధర ప్రకటించే విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామని చెప్పారు.

దేశంలోనే పసుపు ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నా, పసుపు పంటకు మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లాలో పండే పసుపునకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని జియోగ్రాఫికల్ గుర్తింపును ఇవ్వాలని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇప్పటికే విజ్ఞప్తి చే సిన సంగతిని రాధామోహన్‌సింగ్‌కు చెప్పినట్లు కవిత తెలిపారు. ఈ సందర్భంగా ఓ వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించినట్టు తెలిపారు.

మద్దతు ధరపై అధ్యయనానికి కేంద్ర బృందాన్ని పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై అధికారులతో సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారని కవిత చెప్పారు. న్యూక్లియర్ సీడ్ ప్రొడక్షన్ సెంటర్‌ను జగిత్యాలలో ఏర్పాటు చేయనున్నట్టు రాధామోహన్ సింగ్ తెలిపారు. ప్రతినిధి బృందంలో ఎంపీ కవితతో పాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, విద్యాసాగర్‌రావు, జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత డాక్టర్ సంజయ్‌కుమార్, నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement