
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. బీసీలను ఏకం చేస్తూ ఈ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని ప్రకటించడం పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.
తీన్మార్ మల్లన్న కార్యాలయంలో కాల్పులు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న పలు వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు. అయితే, దాడితో అప్రమత్తమైన తీన్మార్ మల్లన్న గన్‌మెన్‌లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.
తెలంగాణ మరో కొత్త రాజకీయ పార్టీ
జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. నాపై హత్యాయత్నం జరిగింది. నన్ను కాపాడేందుకు గన్ మెన్ ఫైర్ చేశారు. దాడి నాపై చేసి.. కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు. పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. దాడికి ఉసిగొల్పిన కవిత శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలి. త్వరలో రాజకీయ పార్టీ పెడతా.. బీసీలను ఏకం చేస్తానని తెలిపారు.
గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ’
2023లో తీన్మార్ మల్లన్న ఓ కేసులో భాగంగా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదల అనంతరం ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో (2024) మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి తీన్మార్ మల్లన్న తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించడం గమనార్హం.