నగరంలోని మ్యాన్‌హోళ్లు మత్యువుకు చిరునామాగా మారాయి. వీటివల్ల ప్రతి ఏడాది వందమంది పారిశుధ్య సిబ్బంది చనిపోతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రత, కాలుపెడితే సర్రున
న్యూఢిల్లీ: నగరంలోని మ్యాన్‌హోళ్లు మత్యువుకు చిరునామాగా మారాయి. వీటివల్ల ప్రతి ఏడాది వందమంది పారిశుధ్య సిబ్బంది చనిపోతున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రత, కాలుపెడితే సర్రున జారిపోయేవిధంగా ఉండే గోడలు, విషవాయువులు ఇందుకు కారణమవుతున్నాయి. నగరంలోని మురుగుకాల్వలపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. మరమతు పనులకోసం వీటిలో దిగుతున్న సిబ్బంది అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. మరికొంతమంది ఏకంగా చనిపోతున్నారు. నేషనల్ క్యాంపెయిన్ ఫర్ డిగ్నిటీ అండ్ రైట్స్ ఫర్ సీవరేజ్ అల్లైడ్ వర్కర్స్ (ఎన్‌సీడీఏఆర్‌ఎస్‌ఏడబ్ల్యూ)తోపాటు ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఓహెచ్‌ఎస్‌ఎంసీఎస్) అనే రెండు సంస్థల సహకారంతో ప్రాక్సిస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ అనే మరో సంస్థ ఈ అంశంపై అధ్యయనం చేసింది.
ఈ సంస్థ నివేదిక ప్రకారం నగరంలో ప్రతిరోజూ 2,871 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. దాదాపు ఐదువేల మంది పారిశుధ్య సిబ్బంది వీటిని తరచూ శుభ్రం చేస్తుంటారు. అయితే వారికి కల్పిస్తున్న వైద్యసదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతోపాటు వారి భద్రతకు ఆయా కార్పొరేషన్లు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమనే విమర్శలు లేకపోలేదు.ఈ కారణంగా వారు అనేకమైన భీకర వ్యాధులబారినపడుతున్నారని సదరు నివేదిక పేర్కొంది. ఇదిలాఉంచితే వారికి ఇస్తున్న వేతనాలు కూడా అంతంతే. దీనికితోడు కులవివక్ష, పక్షపాతం, వత్తిపరమైన భద్రత లేమి తదితర సమస్యలు వారిని నీడమాదిరిగా వెన్నాడుతున్నాయి.
ఈ నేపథ్యంలో పారి శుధ్య సిబ్బంది జీవన ప్రమాణాలపై అందరికీ అవగాహన కల్పించి వారి జీవితాలు మెరుగుపడేందుకు ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసేందుకే తాము ఈ అధ్యయనం నిర్వహించామని ప్రాక్సిస్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పార్టిసిపేటరీ ప్రాక్టీసెస్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయమై ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) కార్మిక సంఘం సభ్యుడు వేద్‌ప్రకాశ్ మాట్లాడుతూ రహదారిపైగల మ్యాన్‌హోళ్లలో దిగి వీరంతా మరమ్మతు పనులు నిర్వర్తిస్తుంటారని, దీంతో వీరిని మత్యుభయం వెన్నాడుతుందన్నారు. పారిశుధ్య సిబ్బందికి మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. రహదారులపై రాకపోకలు సాగించేవారు వారిని దుర్భాషలాడుతుంటారన్నారు. రోడ్డుపై మురుగు పోస్తున్నావంటూ మండిపడుతుంటారన్నారు.