
కమల్‌కు అండగా ఉంటాం: విశాల్
కమలహాసన్‌కు నడిగర్‌సంఘం అండగా ఉంటుందని ఆ సంఘ కార్యదర్శి విశాల్ వ్యాఖ్యానించారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై
పెరంబూర్ : కమలహాసన్‌కు నడిగర్‌సంఘం అండగా ఉంటుందని ఆ సంఘ కార్యదర్శి విశాల్ వ్యాఖ్యానించారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కమల్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలాన్ని రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా అగ్నిపరిక్ష పేరుతో ఒక ప్రముఖ తమిళ చానల్‌కు కమలహాసన్ ఇచ్చిన భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఆగ్రహం కలిగించింది.
తమిళనాడులో వెంటనే ఎన్నికలు జరగాలన్న కమల్‌పై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. కమలహాసన్‌కు 65 ఏళ్ల తరువాత జ్ఞానోదయం అయ్యిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే తమిళనిర్మాతల మండలి అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ అందుకు నిర్మాతల మద్దతు కోరే పనిలో భాగంగా తన బృందంతో కలిసి బుధవారం సేలం వెళ్లారు.
అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమలహాసన్‌కు రాజకీయ పరంగా సమస్యలు తలెత్తితే ఆయనకు అండగా నడిగర్‌సంఘం నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కమలహాసన్ హిందూ మతాన్ని కించపరచే విధంగా మాట్లాడారంటూ హిందూ మక్కల్ కట్చి నిర్వాహకులు చెన్నై పోలీస్‌కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రన్ ఆరోపించారు.