
గనుల కుంభకోణంలోఐఏఎస్ అధికారి అరెస్టు
అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కర్ణాటక రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి గంగారామ్ బడేరియా అరెస్టు అయ్యారు.
బెంగళూరు: అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కర్ణాటక రెవెన్యూ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి గంగారామ్ బడేరియా అరెస్టు అయ్యారు. విచారణ కోసం ఆయన్ను సోమవారం పిలిపించిన కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాయంత్రానికి అరెస్టు చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, ధరంసింగ్‌లు నిందితులుగా ఉన్నారు. బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలోమీరట్ల మేర అటవీ భూమిని నిబంధనలకు విరుద్ధంగా డీ నోటిఫై చేయడమే కాకుండా అక్కడ గనుల తవ్వకాలకు, ఎగుమతులకు అనుమతిచ్చారన్నది ప్రధాన ఆరోపణ.
ఈ విషయమై లోకాయుక్త జస్టిస్ సంతోష్‌హెగ్డే గతంలోనే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారులైన వి.ఉమేష్, గంగారామ్ బడేరియా, ఎం.రామప్ప, జీజా హరిసింగ్ వంటి 11 మంది అధికారులు విధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. ఈ డీ నోటిఫైలో సీఎంలుగా పనిచేసిన కుమారస్వామి, ధరంసింగ్, ఎస్.ఎం కృష్ణల హస్తం కూడా ఉన్నట్లు హెగ్డే నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అబ్రహం జోసెఫ్ అనే సామాజిక కార్యకర్త గనుల అక్రమాలపై దర్యాప్తు జరపాలని గతంలో సుప్రీం కోర్టుకు వెళ్లారు.
పరిశీలించిన కోర్టు డీ నోటిఫైతో పాటు గనులపై మూడునెలల్లోపు విచారణ పూర్తి చేయాలని మార్చి 29న సిట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం తాజా అరెస్టు చోటుచేసుకుంది. అప్పట్లో మైసూరు మినరల్స్ డైరెక్టర్‌గా ఉన్న గంగారామ్ 14,200 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం ఎగుమతికి అక్రమంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.