వచ్చే ఆరు నెలల్లో హంపిలో అభివృద్ధి పనులు | Growth in the next six months in Hampi | Sakshi
Sakshi News home page

వచ్చే ఆరు నెలల్లో హంపిలో అభివృద్ధి పనులు

Jan 26 2014 4:57 AM | Updated on Sep 2 2017 3:00 AM

రాబోయే ఆరు నెలల్లో హంపిలో అత్యుత్తమ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తెలిపారు.

తోరణగల్లు న్యూస్‌లైన్ : రాబోయే ఆరు నెలల్లో హంపిలో అత్యుత్తమ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తెలిపారు. ఆయన శనివారం సండూరు తాలూకాలోని యశ్వంతపూర్‌లో సండూరు పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో మాదిరిగా హంపి అభివృద్ధికి టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీఎం సిద్దరామయ్య బడ్జెట్‌లో పర్యాటక శాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చిప్పటికీ, ఇక్కడ అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్న విలేకర్ల ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు.

తాజ్‌మహల్ తదితర ప్రాంతాలు మాత్రమే కాదు, హంపి కూడా ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా ఖ్యాతి చెందిందన్నారు. హంపి, కరావళి, జోగ, మైసూరు తదితర అనేక పర్యాటక ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. పర్యాటక ప్రాంతం అంటే ఆ ప్రాంతాన్ని వీక్షించడమే కాదు, అక్కడి వ్యవసాయం, ఉద్యానవనాలు, ప్రజల జీవన విధానాలను పర్యాటకులకు పరిచయం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఇందుకోసం పర్యాటక స్థలాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు అక్కడి మానవ వనరులను పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక చట్టాన్ని తెచ్చిందని, దీంతో రాష్టంలోని ప్రముఖ పర్యాటక స్థలాల  గురించి ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాబోయే ఆరు నెలల్లో హంపిని వీలైనంతగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సండూరులోని నారిహళ్ల జలాశయం, కుమారస్వామి ఆలయం, ఉబ్బళగుండి తదితర ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేయాలన్న ప్రస్తావన వచ్చిందన్నారు.
 
సండూరు, హొస్పేట, హళేబీడు, బాదామి, ఐహోళెలతోపాటు ప్రతి జిల్లాలోని పర్యాటక స్థలాలను అభివృద్ధి పరిచే పథకం రూపొందించినట్లు చెప్పారు. పర్యాటకశాఖలో ఖాళీగా ఉన్న వివిధ అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తోందని, ఇందుకు ఆర్థిక శాఖ అనుమతి లభించాల్సి ఉందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement