
ప్రచార సభలకు మైదానాలు కరువు
నగరంలో ఈసారి బహిరంగ సభల సంఖ్య గతంలో కంటే మరింత తగ్గే అవకాశముంది. 2009 ఎన్నికల సమయంలో శివాజీ పార్కు మైదానంలో బహిరంగ సభలకు అనుమతి ఉంది.
సాక్షి, ముంైబె : నగరంలో ఈసారి బహిరంగ సభల సంఖ్య గతంలో కంటే మరింత తగ్గే అవకాశముంది. 2009 ఎన్నికల సమయంలో శివాజీ పార్కు మైదానంలో బహిరంగ సభలకు అనుమతి ఉంది. దీంతో అనేక పార్టీలు అక్కడ సభలు నిర్వహించుకున్నాయి. అయితే ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయింది. దీంతో ఈసారిసభలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ప్రధాన పార్టీలన్నీ తలలు పట్టుకుంటున్నాయి.
ఎన్నికల కమిషన్ నిషేధం, నిశ్శబ్ద ప్రాంతం (సెలైన్స్ జోన్) పరిధిలోకి రావడమే ఈ సమస్యకు అసలు కారణం. సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా నగరంలోని దాదాపు 1,300 ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదు. నగర పరిధిలోబహిరంగ సభలకు మైదానాలు కరువయ్యాయి. సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా ఎమ్మెమ్మార్డీఏ, సోమయ్య కళాశాల ప్రాంగణాలే దిక్కయ్యాయి. దీంతో ఈ రెండింటిపైనే ప్రధానపార్టీలు దృష్టి సారించాయి. ఇవి ఎవరికి లభించనున్నాయనేది వేచిచూడాల్సిందే.
సభల కోసం స్థలాల అన్వేషణ..
రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు స్థలాలకోసం అన్వేషిస్తున్నాయి. నగరంలో ఎక్కడెక్కడ సభ లను నిర్వహించవచ్చనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు స్థలాలు లభించకపోవడంతో రాజకీయపార్టీలన్నీ నగరంలోని ప్రైవేట్ మైదానాలు, మిల్లుల స్థలాలపై దృష్టి కేంద్రీకరించాయి. చిన్న సభలు నిర్వహించుకునేందుకు మాత్రం ఇవి అనుకూలంగా ఉన్నాయి. కాగా సెలైన్స్ జోన్ ఆంక్షల కారణంగా భారీ బహిరంగ సభలకు అవకాశాలు సన్నగిల్లడంతో ప్రధాన పార్టీలతోపాటు అన్ని పార్టీలు రోడ్ షోలు, పాదయాత్రలు, వీధి సభలకు ప్రాధాన్యమిస్తున్నాయి. అనేకమంది నాయకులు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు.