పెళ్లి ఆపేసిన మల్లెపూలు..

Groom Cancels Marriage over 'Poola jada'

హొసకోటె : మల్లె పువ్వులకు బదులుగా కాగడాలతో జడను అలంకరించారనే నెపంతో వివాహం రద్దైన ఘటన శుక్రవారం కృష్ణరాజపురంలోని హొసకోటె తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్‌కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో తాలూకాలోని భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు. 

శుక్రవారం దేవాలయంలో వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. మల్లెపువ్వులతో కాకుండా కాగడా మల్లెలతో వధువు జడను అలంకరించారంటూ వరుడు కుటుంబ సభ్యులు వాగ్వాదం చేయగా.. సమయానికి మల్లెపువ్వులు లభించకపోవడంతో కాగడాలతో అలంకరించాల్సివచ్చిందంటూ వధువు కుటుంబ సభ్యులు నచ్చచెప్పసాగారు. అయినప్పటికీ వరుడు కుటుంబ సభ్యులు వినిపించుకోకపోవడంతో ఇరు కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం శృతి మించింది. వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. 

దీంతో పాలుపోని స్థితిలో చిక్కుకున్న వధువు కుటుంబ సభ్యులు అదే ముహూర్తానికి అదే దేవాలయంలో మరొక యువకుడితో వివాహం జరిపించారు. మరొక యువకుడితో వధువు వివాహం జరగడంతో ఆనంద్‌ కుటుంబ సభ్యులతో సహా అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయారు. కాగా ఘటనపై ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోకపోవడం గమనార్హం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top