breaking news
mallepoolu
-
కదిరి మల్లెల గుబాళింపు.. ఎకరాకు రూ.5 లక్షల ఆదాయం
సాక్షి, సత్యసాయి జిల్లా(కదిరి): కదిరి మల్లెల గుబాళింపునకు దేశంలోనే పేరుంది. ఇక్కడి మల్లెలు వెదజల్లినంతగా ఏప్రాంత మల్లెలు సువాసనలు ఇవ్వలేవన్న పేరు ఉంది. ముఖ్యంగా బ్రహ్మో త్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత సువాసనలు ఇస్తాయని అంటుంటారు. ఈ ప్రాంతంలోని మల్లెల సౌరభాలు ఖాద్రీశుడికి ఎంతో ప్రీతిపాత్రం. కదిరి మల్లెలకు భలే గిరాకీ కదిరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే మల్లెల గుబాళింపు అందరినీ మైమరిపిస్తుంది. ఈ ప్రాంతంలో మల్లె తోటలు ఎక్కువ. దాదాపు 600 ఎకరాలకు పైగా రైతులు మల్లెలు సాగుచేస్తుంటారు. ఇవి ఎందరికో ఉపాధి నిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు మల్లెలను వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో మల్లెపూలను విక్రయించేవారు ప్రత్యేకంగా కదిరి మల్లెలని అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. ఈ ప్రాంత నేల స్వభావం కారణంగానే మల్లెలు మంచి సువాసననిస్తుంటాని రైతులు చెబుతున్నారు. ఖాద్రీశుడికి మల్లెపూల ఉత్సవం అలంకార ప్రియుడైన లక్ష్మీ నారసింహ స్వామికి తెల్లని మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ సువాసనలు వెదజల్లే కదిరి మల్లెలంటే మరింత ప్రీతికరం. దీంతో ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోజు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టణానికి సమీపంలోని మద్దిలేటి ఒడ్డున ఉన్న ఉత్సవ మంటపం వద్ద కొలువుదీర్చి ప్రత్యేకంగా మల్లెపూలతోనే అలంకరిస్తారు. మల్లెపూలను సాగుచేసే రైతులే ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తారు. స్వామివారికి ఎంతో ఇష్టం హిందువుల ఆరాధ్య దైవం శ్రీమహా విష్ణువుకు మల్లెలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెపూలతో అలంకరిస్తాం. శ్రీవారికి మల్లెపూలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో మోహినీ ఉత్సవం నాడు స్వామివారి కుచ్చుల వాలుజడ కదిర మల్లెలతోనే సిద్దం చేస్తాం. ఏటా మల్లెపూల ఉత్సవాన్ని మరింత శోభాయమానంగా నిర్వహిస్తాం. – నరసింహాచార్యులు, నృసింహాలయ ప్రధాన అర్చకుడు ఎకరాకు రూ.5 లక్షలు వస్తుంది ఎకరం పొలంలో మల్లె తోట సాగు చేస్తే ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించవచ్చు. నాకున్న 72 సెంట్ల స్థలంలో పూర్తిగా మల్లెలే సాగు చేస్తున్నా. వేసవిలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలో మల్లెపూలు రూ.500కు అమ్ముడు పోతుంటాయి. సన్నమల్లెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. – విశ్వనాథ్, మల్లెతోట యజమాని, కదిరి రోజూ రూ.300 సంపాదిస్తా కిలో మల్లెపూలు కోస్తే రూ.75 కూలి చెల్లిస్తారు. ఈ లెక్కన రోజూ రూ.300 వరకు సంపాదిస్తాను. ఈ డబ్బుతోనే నా కుమార్తెను బాగా చదివిస్తున్నా. ఏడాదిలో 8 నుంచి 9 నెలలు పూల కోత పని ఉంటుంది. – ప్రమీలమ్మ, కదిరి -
మల్లె పువ్వులు ఎంత పని చేశాయి..
హొసకోటె : మల్లె పువ్వులకు బదులుగా కాగడాలతో జడను అలంకరించారనే నెపంతో వివాహం రద్దైన ఘటన శుక్రవారం కృష్ణరాజపురంలోని హొసకోటె తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని చిక్కనహళ్లి గ్రామానికి చెందిన ఆనంద్కు విజయపుర పట్టణానికి చెందిన యువతితో తాలూకాలోని భీమాకనహళ్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో వివాహం నిశ్చయించారు. శుక్రవారం దేవాలయంలో వివాహ పనులు ప్రారంభమైన కాసేపటికి వధువు పెళ్లి మండపంలోకి అడుగుపెడుతుండగా వధువు జడ అలంకారం విషయమై వధూవరుల కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. మల్లెపువ్వులతో కాకుండా కాగడా మల్లెలతో వధువు జడను అలంకరించారంటూ వరుడు కుటుంబ సభ్యులు వాగ్వాదం చేయగా.. సమయానికి మల్లెపువ్వులు లభించకపోవడంతో కాగడాలతో అలంకరించాల్సివచ్చిందంటూ వధువు కుటుంబ సభ్యులు నచ్చచెప్పసాగారు. అయినప్పటికీ వరుడు కుటుంబ సభ్యులు వినిపించుకోకపోవడంతో ఇరు కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం శృతి మించింది. వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పాలుపోని స్థితిలో చిక్కుకున్న వధువు కుటుంబ సభ్యులు అదే ముహూర్తానికి అదే దేవాలయంలో మరొక యువకుడితో వివాహం జరిపించారు. మరొక యువకుడితో వధువు వివాహం జరగడంతో ఆనంద్ కుటుంబ సభ్యులతో సహా అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయారు. కాగా ఘటనపై ఇరు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకోకపోవడం గమనార్హం. -
గుబాళిస్తున్న మహిళావిజయం
వేసవి వచ్చిందంటే మల్లెపూలు విరగబూస్తాయి. మల్లెచెట్లు పెంచే రైతులకు చేతినిండా సొమ్ములే. ఈ విషయం గమనించిన మద్రాసు మహిళారైతులు మల్లెపూల తోటలనే నమ్ముకుని బతుకుతున్నారు. ఇలాంటి మహిళా రైతుల సంఖ్యను పెంచడం కోసం మద్రాసు ప్రభుత్వం సూక్ష్మరుణాల పేరుతో ఆర్థికసాయం చేస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మహిళారైతులు మల్లెతోటలసాగులో మంచి లాభాలను చూస్తున్నారు. ‘‘ప్రభుత్వమిచ్చే రుణంతో ఏ పంటసాగైనా చేసుకోవచ్చు. మేం మాత్రం అచ్చంగా మల్లెతోటలనే నమ్ముకుని బతుకుతున్నాం. మొక్కలు పెంచడం దగ్గర నుంచి మొగ్గలు తెంపడం వరకూ అన్ని పనులూ మేమే స్వయంగా చేసుకుంటున్నాం. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది. అలాగే అమ్మకం కూడా నేరుగా చేసుకోవడం వల్ల దళారుల జోక్యం కూడా లేదు’’ అని చెప్పారు భాగ్యలక్ష్మి అనే మహిళారైతు. కాలానికి తగ్గ పూలను పెంచుకుంటూ లాభాలను చూస్తున్న మహిళారైతుల సంఖ్య రోజురోజుకీ పెరగాలని కోరుకుందాం!