కదిరి మల్లెల గుబాళింపు.. ఎకరాకు రూ.5 లక్షల ఆదాయం

Kadiri Mallepoolu are Famous all over the India - Sakshi

దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కదిరి మల్లెలు 

లక్ష్మీనారసింహుడికి కదిరి మల్లెలతోనే అలంకరణ  

సాక్షి, సత్యసాయి జిల్లా(కదిరి): కదిరి మల్లెల గుబాళింపునకు దేశంలోనే పేరుంది. ఇక్కడి మల్లెలు వెదజల్లినంతగా ఏప్రాంత మల్లెలు సువాసనలు ఇవ్వలేవన్న పేరు ఉంది. ముఖ్యంగా బ్రహ్మో త్సవాల సమయానికి విరబూసే మల్లెలు మరింత సువాసనలు ఇస్తాయని అంటుంటారు. ఈ ప్రాంతంలోని మల్లెల సౌరభాలు ఖాద్రీశుడికి ఎంతో ప్రీతిపాత్రం.
 
కదిరి మల్లెలకు భలే గిరాకీ 
కదిరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే మల్లెల గుబాళింపు అందరినీ మైమరిపిస్తుంది. ఈ ప్రాంతంలో మల్లె తోటలు ఎక్కువ. దాదాపు 600 ఎకరాలకు పైగా రైతులు మల్లెలు సాగుచేస్తుంటారు. ఇవి ఎందరికో ఉపాధి నిస్తున్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ పట్టణాలకు మల్లెలను వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో మల్లెపూలను విక్రయించేవారు ప్రత్యేకంగా కదిరి మల్లెలని అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు. ఈ ప్రాంత నేల స్వభావం కారణంగానే మల్లెలు మంచి సువాసననిస్తుంటాని రైతులు చెబుతున్నారు.
 
ఖాద్రీశుడికి మల్లెపూల ఉత్సవం   
అలంకార ప్రియుడైన లక్ష్మీ నారసింహ స్వామికి తెల్లని మల్లెపూలు అంటే ఎంతో ఇష్టం. అందులోనూ సువాసనలు వెదజల్లే కదిరి మల్లెలంటే మరింత ప్రీతికరం. దీంతో ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెలతోనే అలంకరిస్తారు. ఏటా వైశాఖ పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మల్లెపూల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆరోజు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను పట్టణానికి సమీపంలోని మద్దిలేటి ఒడ్డున ఉన్న ఉత్సవ మంటపం వద్ద కొలువుదీర్చి ప్రత్యేకంగా మల్లెపూలతోనే అలంకరిస్తారు. మల్లెపూలను సాగుచేసే రైతులే ఈ ఉత్సవానికి ఉభయదారులుగా వ్యవహరిస్తారు. 

స్వామివారికి ఎంతో ఇష్టం 
హిందువుల ఆరాధ్య దైవం శ్రీమహా విష్ణువుకు మల్లెలంటే మహా ఇష్టం. అందుకే ప్రతి రోజూ ఖాద్రీశుడిని కదిరి మల్లెపూలతో అలంకరిస్తాం. శ్రీవారికి మల్లెపూలు      సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో మోహినీ ఉత్సవం నాడు స్వామివారి కుచ్చుల వాలుజడ కదిర మల్లెలతోనే సిద్దం చేస్తాం. ఏటా మల్లెపూల ఉత్సవాన్ని మరింత శోభాయమానంగా నిర్వహిస్తాం. 
– నరసింహాచార్యులు, నృసింహాలయ ప్రధాన అర్చకుడు 

ఎకరాకు రూ.5 లక్షలు వస్తుంది 
ఎకరం పొలంలో మల్లె తోట సాగు చేస్తే ఏడాదికి రూ.5 లక్షలు సంపాదించవచ్చు. నాకున్న 72 సెంట్ల స్థలంలో పూర్తిగా మల్లెలే సాగు చేస్తున్నా. వేసవిలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలో మల్లెపూలు రూ.500కు అమ్ముడు పోతుంటాయి. సన్నమల్లెలకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. 
– విశ్వనాథ్, మల్లెతోట యజమాని, కదిరి 

రోజూ రూ.300 సంపాదిస్తా 
కిలో మల్లెపూలు కోస్తే రూ.75 కూలి చెల్లిస్తారు. ఈ లెక్కన రోజూ రూ.300 వరకు సంపాదిస్తాను. ఈ డబ్బుతోనే నా కుమార్తెను బాగా చదివిస్తున్నా. ఏడాదిలో 8 నుంచి 9 నెలలు పూల కోత పని ఉంటుంది.  
– ప్రమీలమ్మ, కదిరి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top