సబ్సిడీలకు స్వస్తి | Free water bandh in April | Sakshi
Sakshi News home page

సబ్సిడీలకు స్వస్తి

Feb 27 2014 11:38 PM | Updated on Apr 4 2018 7:42 PM

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత నీటి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది.

న్యూఢిల్లీ:ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత నీటి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రాయితీల కోసం నిధులు కేటాయించకపోవడమే ఇందుకు కారణం. ఏప్రిల్ నుంచి రాయితీలు కొనసాగకపోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ ఇటీవల అన్నారు. ఉచిత నీటి పథకం రద్దయితే ఢిల్లీవాసులు నీరు, విద్యుత్‌కు విపరీతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత నీటి పథకం ప్రకారం కుళాయి కనెక్షన్లు ఉన్న వారికి నెలకు 20 వేల లీటర్ల చొప్పున నీరు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగింపుపై తమ వద్ద కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ఢిల్లీ జల్‌బోర్డు (డీజేబీ) అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉందని, సబ్సిడీలు కూడా తొలగించారు కాబట్టి రాయితీ కొనసాగింపుపై త్వరలో జరిగే డీజేబీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. విద్యుత్,నీటి పథకాల రాయితీల కోసం 2013-14 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిధులు కేటాయించని మాట నిజమేనని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు.
 
 ఉచిత నీటి పథకం అమలు కోసం డీజేబీకి ప్రతి నెలా రూ.165 కోట్లు ఖర్చవుతోంది. రాయితీల తొలగింపు కారణంగా డిస్కమ్‌లు చార్జీల మోత మోగిస్తుండగా, ఏప్రిల్ నుంచి నీటి బిల్లులు కూడా వీటికి తోడవుతాయని ఢిల్లీవాసులు భయపడుతున్నారు. ఈ పథకం కొనసాగించాలని డీజేబీ నిర్ణయించుకుంటే ప్రభుత్వం దానిని ఆమోదించాల్సి ఉంటుందని సంస్థ మాజీ అధికారి ఒకరు అన్నారు. రాయితీల కొనసాగింపు, పరిహారం చెల్లింపు కోసం డీజేబీ కేంద్రాన్ని సంప్రదించగా అక్కడి నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ఉచిత నీటి సరఫరా పథకాన్ని రద్దు చేయాలని ఆదేశించిందని ఆర్థికశాఖవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో డీజేబీ శుక్రవారం బోర్డు సమావేశం నిర్వహించనుంది. అయితే ఉచిత నీటి పథకంపై చర్చ ఎజెండాలో లేదు. సబ్సిడీ కొనసాగింపును లెఫ్టినెంట్ గవర్నర్ వ్యతిరేకిస్తే తాము ఏప్రిల్ నుంచి చార్జీలు వసూలు చేయాల్సి ఉంటుందని ఆర్థికశాఖ అధికారి ఒకరు తెలిపారు.
 
 సబ్సిడీ తొలగిస్తే ఊరుకోం : ఆప్
 ఉచిత నీటి పథకం రద్దు పూర్తిగా ప్రజావ్యతిరేక చర్య అని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అభిప్రాయపడింది. రాయితీలను తొలగిస్తే తాము భారీ ఎత్తున ఉద్యమిస్తామని ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అపవిత్ర పొత్తును కూడా బట్టబయలు చేస్తామని హెచ్చరించింది. ‘అవినీతిమయమైన షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని కూలగొట్టినందుకు కాంగ్రెస్ ఇలా పగతీర్చుకుంటోంది. డీజేబీ స్వయంప్రతిపత్తి గల సంస్థ కాబట్టి దాని నిర్ణయాన్ని అడ్డుకునే శక్తి ఎల్జీ, కేంద్ర ప్రభుత్వానికి ఉండబోదు’ అని ఆప్ ప్రకటన తెలిపింది. అయితే ఉచిత నీటి పథకం అమలుకు అవసరమైనన్ని నిధులు డీజేబీ వద్ద ఉన్నాయి కాబ ట్టి దానిని కొనసాగించడం కష్టమేమీ కాదని నిపుణు లు చెబుతున్నారు. రూ.నాలుగు వేల కోట్ల వార్షిక బడ్జెట్ గల డీజేబీ ఉచిత నీటి సరఫరా కోసం రూ.160 కోట్లు ఖర్చు చేయడం కష్టం కాదని అంటున్నారు.ఇదిలా ఉంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలలకు పార్లమెంటు గత శుక్రవారం ఆమోదించిన బడ్జెట్‌లో విద్యుత్ రాయితీ కోసం నిధులు కేటాయించలేదు. ఫలితంగా ఏప్రిల్ ఒకటి నుంచి రాయితీ కొనసాగకపోవచ్చని విద్యుత్‌శాఖ వర్గాలు తెలిపాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 400 యూనిట్ల వరకు వాడుకునే విద్యుత్ వినియోగదారులకు మార్చ్ 31 వరకు మాత్రమే 50 శాతం రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement