‘నవీ’ ఎయిర్‌పోర్టుకు ఐదున టెండర్లు | frb 5th tendor fro new airport | Sakshi
Sakshi News home page

‘నవీ’ ఎయిర్‌పోర్టుకు ఐదున టెండర్లు

Jan 31 2014 5:47 AM | Updated on Sep 2 2017 3:13 AM

నవీ ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించేందుకు ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లను ఆహ్వనించేందుకు రంగం సిద్ధమైంది.

 సాక్షి, ముంబై: నవీ ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించేందుకు ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లను ఆహ్వనించేందుకు రంగం సిద్ధమైంది. ఈ టెండర్లను కేవలం దేశానికి పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆహ్వానిస్తున్నామని సిడ్కో అధ్యక్షుడు ప్రమోద్ హిందురావు, ఎండీ సంజయ్ భాటియా తెలిపారు. ఈ మేరకు నగరంలోని నిర్మల్ సిడ్కో కార్యాలయంలో సిడ్కో డెరైక్టర్లతో జరిగిన సమావేశంలో ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లు ఆహ్వానించాలని తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపాయని, టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ‘ఈ ప్రాజెక్ట్ కోసం అనేక గ్రామాలు, రైతుల భూములు సేకరించాల్సి వచ్చింది. వీరికి పునరావాసం కల్పించడం, నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి, సిడ్కోకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఆరు గ్రామాలు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాయ’ని చెప్పారు. అయితే త్వరలోనే ఆ గ్రామస్తులను నేరుగా కలిసి వారి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. ఈ ఆరు గ్రామాలు ప్రాజెక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవని, శాంతియుతంగా చర్చలు జరిపి వారిని ఖాళీ చెయ్యించే ప్రయత్నం చేస్తామని భాటియా అన్నారు. రూ.9,500 కోట్లతో కూడిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ‘ఇదివరకే ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయానికి అనేక అడ్డంకులు ఎదుర య్యాయి.
 
  పర్యావరణ, అటవీ తదితర శాఖల నుంచి అనుమతులు పొందడానికి ఎంతో కసరత్తు చేశాం. చివరకు అన్ని శాఖల నుంచి అనుమతులు లభించడంతో పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంద’న్నారు. ఫిబ్రవరి ఐదో తేదీన టెండర్లను ఆహ్వానించినా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం సంవత్సరంపైనే సమయం పడుతుందని భాటియా స్పష్టం చేశారు. ఆ తర్వాత విమానాశ్రయం నిర్మాణపనులు ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయన్నారు. అంతకుముందు ఖాళీచేసిన ఈ గ్రామాలను పూర్తిగా నేలమట్టం చేయాలన్నారు. కాగా, ఈ విమానాశ్రయంపై నగరం, తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో చేపడుతున్న అనేక ఫ్లైఓవర్లు, మెట్రో, మోనో రైలు లాంటి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు, మోనో, మెట్రో మార్గాలు విస్తరించనున్నాయి. దీంతో విమానాశ్రయం పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు సిడ్కో ప్రయత్నాలు చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement