బాణసంచాకు 11 మంది బలి


- మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తి

- కొన్ని మీటర్ల మేర ఎగిరిపడిన మృతదేహాలు

- సాంగ్లీ జిల్లా తాస్‌గావ్ తాలూకా కవాతే ఏకంద్‌లో ఘటన

- టపాసుల తయారీకి ఆ గ్రామం ప్రసిద్ధి..

- అనుమతి లేని తయారీ కేంద్రాలెన్నో.. పట్టించుకోని అధికారులు

సాక్షి, ముంబై:
భద్రత లేని టపాసుల కేంద్రంలో పనిచేస్తూ మరోమారు బడుగుజీవులు అసువులు బాసారు. బతుకుతెరువు కోసం వెళ్లి మంటలకు ఆహుతయ్యారు. సాంగ్లీ జిల్లా తాస్‌గావ్ తాలూకా కవాతే ఏకంద్‌లోని ‘ఈగల్ ఫైర్ వర్క్స్’ టాపసుల తయారీ కంపెనీలో సంభవించిన భారీ పేలుడులో 11 మంది మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి శరీరాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఘటనా స్థలి రక్తపు మరకలతో మాంసపు ముద్దలతో హృదయవిదారకంగా మారింది. రెండు భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తాస్‌గావ్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ పాటిల్ ‘సాక్షి’కి ఫోన్‌లో అందించిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఈగల్ ఫైర్ కంపెనీలో పేలుడు సంభవించింది.



దీంతో మొత్తం కవాతే ఏకంద్ గ్రామంతా ఉలిక్కిపడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఈగల్‌ఫైర్ వర్క్స్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి గ్రామస్తులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కొద్ది సేపటికే అగ్నిమాపక సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. ఈ ఘటనలో ప్రమాదస్థలిలోనే ఆరుగురు మరణించగా, తీవ్రగాయలైన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరో అయిదుగురు మరణించారు. చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. మృతులు అనికేటి గురవ్(16), శరత్ గురవ్(30), ఇందూబాయ్(60), జిబిదా నదాబ్(53),సునందగిరి(45), శంభుగిరి, రామగిరి అని పోలీసులు తెలిపారు. మిగతా నలుగురు మృతుల పేర్లు తెలియ రాలేదు.



భద్రత లోపమే...?

భద్రత, నియమాల ఉల్లంఘనలే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈగల్ ఫైర్ వర్క్స్‌లో జరిగిన పేలుడుకు కారణాలు ఏవన్నది ఇంకా తెలియరాలేదు. టపాసుల తయారీకి కవాతే ఏకంద్ గ్రామం ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ అనేక టపాసుల తయారీ ఫ్యాక్టరీలున్నాయి. కానీ ఏ ఫ్యాక్టరీలోనూ నిర్దేశించిన భ ద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అనుమతి లేకుండా ఇష్టారీతిన ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకోవడం, నిర్దేశింన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.



రెండేళ్ల కిందట ఇదే గ్రామంలో ఓ టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం పాలయ్యారు. పదేపదే ఇలాంటి ఘటనలు జరిగినా మేలుకోని అధికారులు, ఫ్యాక్టర్లీ యజమానులు భద్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనుమతి లేకుండానే చాలా ఫ్యాక్టరీల్లో టపాసులు తయారీ చేస్తున్నట్టు ఆరోపణ ఎప్పటి నుంచో ఉన్నాయి. పేలుడుకు సంబంధించి కంపెనీ యజమానిపై తాస్‌గావ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top