సీఎంగారూ.. ఆత్మహత్య చేసుకుంటున్నా

Farmer Commits Suicide In Karnataka After Letter To CM - Sakshi

లేఖ రాసి రైతన్న బలవన్మరణం  

మండ్య జిల్లాలో విషాదం  

భారీగా రైతు సంఘాల ఆందోళన.. అరెస్టులు

సాక్షి బెంగళూరు: మండ్య జిల్లాలో రైతు జయకుమార్‌ (44) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కుమారస్వామికి సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో రైతుసంఘాల నాయకులు భారీ ఆందోళనకు దిగడం, పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దుద్దా హొబ్లి కన్నహట్టి గ్రామంలో చోటు చేసుకుంది.  
కన్నహట్టి గ్రామానికి చెందిన జయకుమార్‌ కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. కొంత పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. సూసైడ్‌ నోటులో రైతుల కష్టాలు, రోజురోజుకు పెరుగుతున్న అప్పులు, పండని పంటలు, గిట్టుబాటు కాని ధరలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. కుటుంబంపై అభిమానం, వ్యవసాయంలో అనుభవం ఉన్నప్పటికీ ఆత్మహత్య చేసుకోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యకు 35 ఏళ్లు, కుమార్తెకు 15, కుమారుడికి 9 ఏళ్ల వయసు ఉన్నట్లు లేఖలో రాశాడు. తనకు వంశపారం పర్యంగా తండ్రి నుంచి 27 గుంటల పొలం ఉందన్నాడు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందినట్లు వివరించాడు. తన తండ్రి వైద్యం కోసం రూ.2 లక్షలు అప్పు జేసినట్లు పేర్కొన్నాడు. అయితే తనకు కూడా క్యాన్సర్‌ ఉందని వైద్యులు ఇటీవల తెలిపారు. చికిత్సకు రూ.3 లక్షలు అవసరమని చెప్పారు.

పంటలు లేవని ఆవేదన  
గత నాలుగేళ్లుగా పంటలు సరిగా పండలేదు. ఈ సారి రూ.80 వేల పెట్టుబడితో పంట వేశాను. అయితే ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఫలితంగా తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. క్యాన్సర్‌ వైద్యానికి, వ్యవసాయానికి కలిపి రూ. 5 లక్షల వరకు అప్పుడు చేశాడని స్థానికులు తెలిపారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో రైతు నేతలు తరలివచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని వారిని బస్సుల్లో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా శనివారమే సీఎం కుమారస్వామి జిల్లాలో పర్యటించాల్సి ఉండగా ఈ ఘోరం జరగడం గమనార్హం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top