యూపీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, కుంభకోణాలపై ఎప్పటికప్పుడు దీటుగా స్పందించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు.
నాగపూర్: యూపీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, కుంభకోణాలపై ఎప్పటికప్పుడు దీటుగా స్పందించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని గురువారం ఆ పార్టీ సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. యూపీఏ సర్కార్‌పై, కాంగ్రెస్ నాయకులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు, కుంభకోణాల ఆరోపణలను తమ పార్టీ నాయకులు సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. దీంతో ఆయా విమర్శలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాక, ప్రజల్లో కూడా పార్టీపై వ్యతిరేకత పెరిగేందుకు అవకాశమిచ్చినట్లయ్యిందని విశ్లేషించారు.
‘కాంగ్రెస్‌పై వచ్చిన విమర్శలపై మా పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు సమర్థవంతంగా స్పందించకపోవడంతో ప్రజలు మాకు ఓటు వేసేందుకు ఇష్టపడలేద’ని అయ్యర్ అభిప్రాయపడ్డారు. ఎంపీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌పై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి అయిన అయ్యర్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘ప్రతి రాజకీయపార్టీకి గెలుపోటములు సహజం. ఈ ఎన్నికల్లో ఓటమితో మేం కుంగిపోవడంలేదు. మళ్లీ మేం పుంజు కుంటాం.
ఆ ధీమా మాకుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలోనే తిరిగి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటాం..’ అని స్పందించారు. కుంభకోణాల ఆరోపణలపై తమ పార్టీ నాయకులు స్పందించిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘రూ.1.76 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికపై అప్పటి టెలికాం మంత్రి అయిన కపిల్ సిబాల్ వెంటనే స్పందించకుండా మూడు నెలల తర్వాత మాట్లాడారు. ఆ వ్యవధిలో పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆరోపణలపై బాధ్యులెవరూ స్పందించకపోవడంతో అవి నిజమేనేమోనన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడింది. అలాగే కొన్ని లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జరిగిన జాప్యం కూడా పరాజయానికి కారణమైందని చెప్పొచ్చు. ఉదాహరణకు తమిళనాడులోని ద క్షిణ చెన్నై స్థానానికి నామినేషన్ల ఘట్టం ఇంకో రెండు గంటల్లో ముగుస్తుందనగా పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించారు. అలాంటి సందర్భాల్లో పార్టీ ప్రజల మద్దతును ఎలా కూడగట్టుకోగలుగుతుంది..’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
‘అలాగే ‘బోఫోర్స్’ కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరును అన్యాయంగా ఇరికించారు. ఆ ఆరోపణలు అవాస్తవమని తర్వాత బయటపడింది. సదరు ఒప్పందంలో రాజీవ్ గాంధీకి ఎటువంటి సంబంధంలేదని నాకు వ్యక్తిగతంగా తెలుసు..’ అని అయ్యర్ వివరించారు.