దోస్త్‌ మేరా దోస్త్ | DMK alliance talks stir Tamil Nadu politics | Sakshi
Sakshi News home page

దోస్త్‌ మేరా దోస్త్

Jan 3 2016 3:32 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదని తమిళనాడు రాజకీయాలు మరోసారి నిరూపించబోతున్నాయి.

 రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మిత్రుత్వం ఉండదని తమిళనాడు రాజకీయాలు మరోసారి నిరూపించబోతున్నాయి. గతంలో కత్తులు దూసుకున్న పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు సిద్ధమవుతు
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: యూపీఏ ప్రభుత్వంలో రెండు విడతల డీఎంకే, కాంగ్రెస్‌లు మిత్రపక్షాలుగా నిలిచాయి. మాజీ మంత్రి రాజా, మేనల్లుడు మాజీ మంత్రి దయానిధి మారన్, గారాల పుత్రిక కనిమొళిలపై అవినీతి ఆరోపణలు, సీబీఐ కేసుల వ్యవహారంలో యూపీఏ ప్రభుత్వం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహించిన డీఎంకే అధినేత కరుణానిధి 2013 ఆఖరులో కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేశారు. అలా దూరంగా ఉంటూనే రాజ్యసభ ఎన్నికల్లో కనిమొళి విజయం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లను కరుణ వాడుకున్నారు. ఆ తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే దోస్తీని ఆశించిన రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రస్థాయిలో భంగపడింది.
 
  యూపీఏ ప్రభుత్వం అనేక కోణాల్లో అప్రతిష్టపాలు కావడంతో డీఎంకే సహా ఏ ప్రాంతీయ పార్టీ సైతం కాంగ్రెస్‌ను కలుపుకొని పోయేందుకు ఇష్టపడలేదు. దీంతో మేకపోతు గాంభీర్యాలకు పోయిన కాంగ్రెస్ ఒంటరిపోరు చేసి డిపాజిట్లు కోల్పోయింది.అదే రీతిలో డీఎంకే సైతం ఘోర ఓటమిని చవిచూసింది. ఇదిలా ఉండగా, అధికార అన్నాడీఎంకే, బీజేపీలు పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు మిత్రపక్షంగా మారే అవకాశం మెండుగా ఉందనే  ప్రచారం సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అన్నాడీఎంకే చెలిమి కుదిరిన పక్షంలో ఛేదు అనుభవాన్ని చవిచూడక తప్పదని కాంగ్రెస్, డీఎంకేలో కలత చెందుతున్నాయి.
 
  ‘కలిసి ఉంటే కలదు సుఖము కలిసి వచ్చిన అదృష్టము’ అంటూ పాటలు పాడుకుంటున్న కాంగ్రెస్, డీఎంకేలు పరోక్షంగా పచ్చజెండాలు ఊపేశాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న అన్నాడీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలను మట్టికరిపించాలంటే రాష్ట్రంలోని లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలనే నినాదం బయలుదేరింది. సందర్భం వచ్చినపుడల్లా కాంగ్రెస్, డీఎంకేలు పరస్పరం అభినందనలు తెలుపుకుంటున్నాయి. ఒంటరిపోరుకు తగిన బలం ఉన్నా లౌకిక పార్టీలతో ఏకం కాక తప్పదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. డీఎంకే పొత్తులకు సిద్ధమవుతున్నట్లు ఆయన వ్యాఖ్యల్లో అర్థం దాగి ఉంది. అలాగే డీఎంకే అధినేత కరుణానిధి సైతం కాంగ్రెస్‌కు పరోక్షంగా ఆహ్వానం పలికారు.
 
  గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని 29 అసెంబ్లీ సీట్లు సాధించుకున్న డీఎండీకే ఆ తరువాత ముఖ్యమంత్రి జయలలితతో తీవ్రంగా విభేదించి బైటకు వచ్చింది. రాష్ట్రంలోని మూడు పెద్ద ప్రాంతీయ పార్టీల్లో తృతీయస్థానంలో ఉన్న డీఎండీకేను తమ కూటమిలో చేర్చుకోవడం ద్వారా అన్నాడీఎంకే ఆధిపత్యానికి చెక్‌పెట్టాలని కాంగ్రెస్, డీఎంకే గట్టిపట్టుతో ఉన్నాయి. ఒకనాటి మిత్రులు, ఆ తరువాత శత్రువులుగా మెలిగిన కాంగ్రెస్,డీఎంకేలు అలాగే జయకు మిత్రపక్షంగా ఉండి నేడు ప్రతిపక్షం పంచన చేరేందుకు సిద్ధమైన విజయకాంత్ రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు శాశ్వతం కాదని మరోసారి చాటి చెప్పబోతున్నారు. కాంగ్రెస్, డీఎంకే నేతలు మళ్లీ చెట్టాపట్టాలు వేసుకోవడానికి సిద్ధమవుతుండడంతో కాంగ్రెస్, డీఎంకే నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement