
ఢిల్లీ రవాణాశాఖ మంత్రి రాజీనామా
ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారమిక్కడ ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారమిక్కడ ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగానే రవాణా శాఖ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గోపాల్ రాయ్ తెలిపారు. దీంతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ...రవాణా శాఖ బాధత్యలను స్వీకరించనున్నారు. కాగా బస్సుల కుంభకోణంలో గోపాల్ రాయ్పై ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని గోపాల్ రాయ్ అన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఆయన నిన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వివరణ కూడా ఇచ్చారు. గతంలో ఆటో పర్మిట్ల కేటాయింపులో భారీగా అక్రమాలు చోటుచేసుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం 932 ఆటో పర్మిట్లను రద్దు చేసింది. దీంతో అక్రమాలు జరిగాయంటూ గోపాల్ రాయ్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవలే గోపాల్ రాయ్ మెడలో ఉన్న బుల్లెట్ను వైద్యులు తొలగించారు. 17 ఏళ్ల క్రితం లక్నో యూనివర్సిటీలో విద్యార్ధుల ఆందోళన సమయంలో పోలీసుల కాల్పుల్లోఆయన మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన ఏడాది పాటు పక్షవాతానికి కూడా గురయ్యారు. ఈ నేపథ్యంలో విశ్రాంతి కోసమే రవాణా శాఖ బాధ్యతల నుంచి గోపాల్ రాయ్ తప్పుకున్నట్లు తెలిపారు.