
ఢిల్లీ: అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీని, ఆ పార్టీ నేతల్ని ఇప్పుడే అదే అవినీతి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆప్ నేతలపై మూడు మనీ లాండరింగ్ కేసుల్ని నమోదు చేశారు. అధికారంలో ఉండగా మూడు కుంభకోణాల్లో సదరు నేతలు పాలు పంచుకున్నారని ఈడీ తెలిపింది.
ఆప్ నేతలపై ఈడీ నమోదు చేసిన మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్)కు జత చేసిన ఎఫ్‌ఐఆర్‌లు కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో సీసీటీవీ ఫుటేజీల ఏర్పాటు,ఆస్పత్రుల నిర్మాణాలు,అభాగ్యులు ఉండేందు ఆసరా కల్పించే ప్రత్యేక షెల్టర్ హోమ్ పేరుతో సుమారు రూ.6,368 కోట్ల విలువ చేసే కుంబకోణం జరిగింది.
ఈ స్కామ్‌లో ఆప్ సీనియర్ నేతలతో పాటు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ బరద్వాజ్,సత్యేంద్ర జైన్ వంటి నేతల ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తుంది. విచారణకు హాజరు కావాలంటూ త్వరలోనే వీరికి ఈడీ సమన్లు జారీ చేయనుంది.
ఈడీ లెక్కల ప్రకారం.. 2018-19 అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఆరు నెలల్లో 24 ఐసీయూ కూడిన ఆస్పత్రులు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ యాభైశాతం పనులు పూర్తయినప్పటికీ ఇందుకోసం సుమారు రూ.800 కోట్లు నిధుల్ని విడుదల చేసింది. అయితే, వీటిల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రితో పాటు ఇతర పలు ఆస్పత్రుల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.488 కోట్ల నుంచి రూ.1135 కోట్లకు పెరిగింది. వీటి నిర్మాణానికి కేటాయించే నిధుల విషయంలో సరైన అనుమతులు లేవని ఈడీ ఆరోపిస్తోంది.
సీసీటీవీ స్కామ్(రూ.571కోట్లు)
2019లోనే కేజ్రీవాల్ ప్రభుత్వం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.4లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చే ప్రాజెక్ట్‌ను ప్రతీష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్)కు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.571 కోట్లు. ఒప్పందం ప్రకారం అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో ఆప్ ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌కు రూ.17కోట్లు ఫైన్ వేసింది. కొంతకాలానికి ఎలాంటి వివరణ లేకుండా ఫైన్‌ను రద్దు చేసింది. ఇందుకోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ శాఖ కార్యకాలాపాలు నిర్వహించిన సత్యేంద్ర జైన్ రూ.7కోట్లు లంచతీసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. సత్యంద్ర జైన్ మీద కేసు కూడా నమోదు చేసింది.
ఢిల్లీ అర్బన్ షెల్టర్ బోర్డు 'స్కామ్' (రూ.207 కోట్లు)
ఆప్ హయాంలో ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డ్ (DUSIB)లో కూడా అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. నకిలీ ఎఫ్‌డీఆర్‌లు (ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదులు) ఉపయోగించి రూ.207 కోట్లు దుర్వినియోగం చేశారని, పటేల్ నగర్‌లో రూ. 15 లక్షల రోడ్డు కుంభకోణం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి రూ. 250 కోట్ల విలువైన పనిని చేసినట్లు చూపించినట్లు ఈడీ గుర్తించింది. నకిలీ కార్మికులకు జీతాలు చెల్లించారని, రాజకీయ నాయకులకు కమీషన్లు ఇచ్చారని కూడా ఆరోపించబడింది.ఈ విషయాలపై సీబీఐ,ఏసీబీలు దర్యాప్తు చేస్తున్నాయి.