తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కూడా రద్దుచేసే కుట్ర జరుగుతున్నట్లు తెలిసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
ప్రజావ్యతిరేక నిర్ణయాల వెనుక బీజేపీ, కాంగ్రెస్ కుట్ర: ఆప్
Feb 26 2014 11:33 PM | Updated on Mar 18 2019 9:02 PM
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని కూడా రద్దుచేసే కుట్ర జరుగుతున్నట్లు తెలిసిందని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వెనుక కాంగ్రెస్, బీజేపీల కుట్ర ఉందని ఆరోపించింది. ఒకవేళ తమకు అందిన సమాచారం సరైనదై, ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని రద్దు చేస్తే.. తమను ఓడించిన ఢిల్లీ ప్రజలపై యూపీఏ ప్రభుత్వం క్షక్ష తీర్చుకుంటోందనే విషయం రుజువైనట్లేనని ఆప్ పేర్కొంది. దీనిపై తమ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందని, బీజేపీ, కాంగ్రెస్‌ల అపవిత్ర పొత్తును ప్రజల్లోనే ఎండగడతామని ఆప్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ జల్‌బోర్డు స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయినందున అది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదేశించే అధికారం కేంద్రానికిగానీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కుగానీ లేదని పేర్కొంది.
తమ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకం వల్ల ప్రభుత్వంపై పెద్ద భారమేమీ పడదన్నారు. డీజేబీకి కావలసినన్ని వనరులు ఉన్నందున పథకాన్ని అమలు చేస్తుందనే తాము భావిస్తున్నామన్నామని ఆ పార్టీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలు అమలు కాకుండా బీజేపీ, కాంగ్రెస్‌లు అడ్డుపడ్డాయని, చివరికి మంచినీటి సరఫరా విషయంలో కూడా నగరవాసులకు మేలు జరిగేలా ఆ రెండు పార్టీలు వ్యవహరించడంలేదని ఆయన విమర్శించారు. విద్యుత్ బిల్లుల మాఫీ విషయంలో కూడా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపివేయడాన్ని గుర్తుచేశారు. ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది తామేనని, అప్పుడైనా ఈ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు.
Advertisement
Advertisement