మారిన రాజకీయ చిత్రం బీజేపీ, ఆప్ మధ్యనే ప్రధాన పోటీ | Delhi Assembly Elections aap bjp major competition | Sakshi
Sakshi News home page

మారిన రాజకీయ చిత్రం బీజేపీ, ఆప్ మధ్యనే ప్రధాన పోటీ

Jan 24 2015 10:57 PM | Updated on Mar 29 2019 9:31 PM

విధానసభ ఎన్నికలు 14 నెలలకే మళ్లీ జరుగుతున్నప్పటికీ స్థానిక రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది.

సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలు 14 నెలలకే మళ్లీ జరుగుతున్నప్పటికీ స్థానిక రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పాటుతో బీజేపీ బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం, ఆప్‌కు తన పరిమితులు, తప్పొప్పులు తెలిసిరావడం ఈ ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయి. గత ఎన్నికలలో 32 సీట్లు గెలిచిన బీజేపీ మరింత బలపడడానికి ప్రయత్నిస్తుండగా, అందిన అధికారాన్ని చేజేతులా కోల్పోయిన ఆప్... మరోమారు దాన్ని సొంతం చేసుకునేందుకు యత్నిస్తోంది. ఇక స్థానికంగా ప్రశ్నార్థకంగా మారిన తమ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్‌ల మధ్యనే ప్రధానపోటీ జరగనుంది.
 ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీలు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. తత్ఫలితంగా గత ఎన్నికల సమయంలో ప్రచారానికీ, ప్రస్తుత ప్రచారానికీ తేడా కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. గత ఎన్నికల సమయంలో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచార సారథ్యం వహించిన షీలాదీక్షిత్, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా. హర్షవర్ధన్ ఇప్పుడు లేరు. కాంగ్రెస్ తరపున అజయ్ మాకెన్, బీజేపీ తర ఫున కిరణ్‌బేడీ ప్రచారం చేస్తున్నారు.
 
 మారిన కమలం ప్రచారవ్యూహం
 ప్రస్తుత ఎన్నిక ల్లో బీజేపీ ప్రచార వ్యూహం మారిపోయింది. కిందటిసారి 32 సీట్లు వచ్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేకపోయిన ఆ పార్టీ ఈసారిబ ఎలాగైనా గద్దె ఎక్కేందుకు తహతహలాడుతోంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీంతోఅంతర్గత కుమ్ములాటలతో మునిగితేలే స్థానిక నేతలు ఇప్పుడు ఆయన కనుసన్నల్లో నడుస్తున్నారు. ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం ఎటువంటి సాహసానికైనా  వెనుకాడడం లేదు. రాజకీయ అనుభవం లేని కిరణ్‌బేడీని ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత పార్టీలో చేర్చుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతోపాటు రాత్రికి రాత్రి పార్టీలు మార్చిన నేతలకు టికెట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వెల్లువెత్తిన వ్యతిరేకతను పట్టించుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు బలంతోపాటు నిజాయితీకి మారుపేరుగా నిలిచిన కిరణ్ బేడీ పార్టీలో చేరడంతో గత  ఎన్నికల కంటే ఈసారి బలీయమైన శక్తిగా మార్చిందని పరిశీలకులు అంటున్నారు. అధిష్టానం అండతో ప్రచార పగ్గాలు స్వీకరించిన కిరణ్ బేడీ మహిళలకు భద్రత కల్పిస్తానని, సమర్థ పాలనను అందిస్తానని, సామాన్యులకు చేరువలో ఉంటానని హామీలు కురిపిస్తూ ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు.  
 
 అంతా తానై ఆప్ నేత ముందుకు
 ప్రస్తుత ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుని కనీసం ఐదేళ్లు అధికారంలో ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల మాదిరిగానే ఇప్పుడుకూడా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సర్వం తానై ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 2013 ఎన్నికల తరువాత 49 రోజులపాటు అధికారంలో కొనసాగిన అరవింద్  రాజీనామా కారణంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సంగతి విదితమే. గతంలో మాదిరిగా మరోసారి రాజీనామా తప్పిదం చేయబోమని నమ్మబలుకుతూ ఆప్ నేతలు ప్రచారం సాగిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరిగాయని, జుగ్గీజోపిడీలు కూల్చివేస్తున్నారంటూ బీజేపీపై  కేజ్రీవాల్ ఆరోపణాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. గతంలో పార్టీ తరఫున బరిలోకి దిగిన  కొందరు ప్రస్తుత ఎన్నికల్లో వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగడం ఆప్‌కు  ఇబ్బందికరంగా  మారింది.     
 గత ఎన్నికల సమయంలో ఆప్‌ను గట్టి రాజకీయ శక్తిగా గుర్తించడానికి నిరాకరించిన కాంగ్రెస్. బీజేపీ ఇప్పుడు ఆ పార్టీని మట్టి కరిపించడం కోసం తమ సకల శక్తియుక్తులను కేంద్రీకరిస్తున్నాయి. ఇందుకోసం ప్రజారంజకమైన ఆప్ హామీలను తమ సొంతం చేసుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.
 
 కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు
 గత ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ కేంద్రంగా జరగ్గా ప్రస్తుతం తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. గెలుపే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఆ పార్టీ...రాహుల్ గాంధీ మార్గదర్శకాలను సైతం పక్కనబెట్టి వయసుపైబడిన, ఓడిపోయిన నేతలకు టికెట్లు ఇచ్చింది. చౌదరి ప్రేమ్‌సింగ్, ఏకే వాలియా వంటి పలువురు కాంగ్రెస్ దిగ్గజాలకు ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. గత ఎన్నికల సమయంలో సర్వత్రా దర్శనమిచ్చిన షీలాదీక్షిత్ పేరు ఇప్పుడు వినిపించడమే లేదు. స్థానిక కాంగ్రెస్ రాజకీయాలలో షీలాదీక్షిత్‌కు విరోధిగా ముద్రపడిన అజయ్ మాకెన్ ఈ ఎన్నికలలో పార్టీ ప్రచార పగ్గాలు చేపట్టారు. మాకెన్ రాకతో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఫలితంగా డీసీపీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ ఎన్నికల బరి నుంచి వైదొలిగారు. కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు బలంగా వీచినప్పటికీ గత ఎన్నికల్లో గాంధీనగర్ సీటు నుంచి గెలుపును సొంతం చేసుకున్న ఆయనకు బదులు మరో అభ్యర్థిని నిలబెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement