కాంగ్రెస్ భూస్థాపితమే ప్రజల ఆకాంక్ష | congress wont get power in central government : venkaiah naidu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ భూస్థాపితమే ప్రజల ఆకాంక్ష

Dec 21 2013 2:17 AM | Updated on Mar 29 2019 9:18 PM

కాంగ్రెస్ భూస్థాపితమే ప్రజల ఆకాంక్ష - Sakshi

కాంగ్రెస్ భూస్థాపితమే ప్రజల ఆకాంక్ష

చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే తమ ఓటు బ్యాంకుగా ఇన్నేళ్లూ భావిస్తూ వచ్చిందో ఆ వర్గానికి చెందిన ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు.

 దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని ప్రజలే కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎం వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దీని ఫలితమే నాలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే తమ ఓటు బ్యాంకుగా ఇన్నేళ్లూ భావిస్తూ వచ్చిందో ఆ వర్గానికి చెందిన ప్రజలే బుద్ధి చెప్పారని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లోని ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ ఎంతటి దుస్థితికి చేరుకుందో తేటతెల్లం అవుతోందని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో 32 ఎస్సీ సీట్లలో ఒక్కసీటులో కూడా గెలుపొందలేదని చెప్పారు. 25 ఎస్టీ సీట్లలో బీజేపీ 18 దక్కించుకోగా కాంగ్రెస్ నాలుగింటితో సరిపెట్టుకుందని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 35 ఎస్సీ స్థానాల్లో 21, 45 ఎస్టీ స్థానాల్లో 31 బీజేపీ దక్కించుకోగా కాంగ్రెస్ కేవలం 4 ఎస్సీ, 14 ఎస్టీ స్థానాల్లో గెలుపొందిందని తెలిపారు. తమ పార్టీకి ఆయువు పట్టు అని చెప్పుకునే డిల్లీలో సైతం 9 ఎస్సీ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలుపొందిందని తెలిపారు. ఇలా మిగిలిన స్థానాల్లో సైతం ఇటువంటి చేదు అనుభవాలనే కాంగ్రెస్ చవిచూసిందన్నారు.
 
  కాంగ్రెస్ తమను ఓటుబ్యాంకుగా వాడుకుంటోందని దళితులు, గిరిజనులు సైతం గ్రహించారని పేర్కొన్నారు. చిన్నారులకు లాలీపప్స్ ఇచ్చినట్లుగా నగదు బదిలీ పథకంతో ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం కూడా విఫలమైనట్లు నాలుగు రాష్ట్రాల ఫలితాలు తేటతెల్లం చేశాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆధార్ నిరాధారంగా మారిందని, నగదు బదిలీతో అధికారం బదిలీ ఖాయమని అన్నారు. ఆహారభద్రత బిల్లు కాంగ్రెస్‌కు ఎంతమాత్రం పార్టీ భద్రత కల్పించదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి విల్‌పవర్ లేనపుడు ఎన్ని బిల్లులు చేసినా నిష్ర్పయోజనమని ఎద్దేవా చేశారు. సంప్రదాయ ఓటర్లే ఛీ కొట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీని కనుమరుగుచేసేందుకు నిశ్చయించుకున్నారని చెప్పారు. దేశంలో మరే పార్టీలోనూ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీకి దీటైన అభ్యర్థి లేరని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్ల ప్రజలు స్పష్టమైన తీర్పును ఇస్తారని, మ్యాజిక్ ఫిగర్ సాధించడం ఖాయమని అన్నారు.
 
 డీఎంకేతో పొత్తుపై ఇంకా ఆలోచనలేదని అన్నారు. వారు తమను కోరలేదని, తాము వారిని అడగలేదని చెప్పారు. దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఉండటం వల్లనే భారత రాయబారి పట్ల అమెరికా నీచమైనరీతిలో వ్యవహరించిందని, తమిళనాడులో ఈలం తమిళులు, జాలర్ల సమస్యలకు కూడా ఇదే కారణమని అన్నారు.
 
 కాంగ్రెస్ డబుల్‌గేమ్
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ డబుల్‌గేమ్ ఆడుతోందని వెంకయ్యనాయుడు ఆరోపించారు. పీఎమ్ ప్రపోజ్ చేస్తారు, సీఎం అపోజ్ చేస్తారు ఇదేమి రాజకీయం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పులేదన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అదే స్థాయిలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను పరిశీలనలోకి తీసుకోవాలని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement