శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ
న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు రహస్య పొత్తు కుదుర్చు కున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ విజయం సాధిస్తుందేమోనని ఆ రెండు పార్టీలు భయపడుతున్నాయన్నారు. అందువల్లనే తమను ఎదుర్కొనేందుకు అపవిత్ర ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు.
ఆప్...జాతి వ్యతిరేక పార్టీ అని, ఒక్క సీటు రావడం కూడా కష్టమేనన్నారు. కాశ్మీర్‌ను పాకిస్థాన్‌కు అప్పగించాలనే వాదనకు ఆ పార్టీ మద్దతు పలుకుతోందన్నారు. అవినీతి అంశంపై ఆ పార్టీ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిందని, అయితే ఏ ఒక్క కేసునూ నిరూపించలేకపోయిందన్నారు. రాబర్ట్ వాద్రా కేసుకు సంబంధించి ఏనాడైనా కోర్టుకు వెళ్లారా అంటూ ఆ పార్టీ నాయకులను నిలదీశారు. ఆప్‌కి ఆర్థిక వనరుల విషయంలో వచ్చిన ఆరోపణలకు ఇప్పటిదాకా జవాబివ్వనే లేదన్నారు. కనీసం ఖండించ లేకపోయిందని ఎద్దేవా చేశారు.