చిన్నప్పరెడ్డి ఓ గొప్ప న్యాయమూర్తి | chinappa reddy is a great lawyer | Sakshi
Sakshi News home page

చిన్నప్పరెడ్డి ఓ గొప్ప న్యాయమూర్తి

Jan 20 2014 2:22 AM | Updated on Sep 2 2017 2:47 AM

జస్టిస్ ఒంటెద్దుపల్లి చిన్నప్పరెడ్డి ఓ గొప్ప న్యాయమూర్తి అని, ఆయన న్యాయమూర్తులకు, న్యాయవాదులకు స్ఫూర్తిగా నిలిచారని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగమోహన్‌దాస్ అన్నారు.

 సాక్షి, బళ్లారి : జస్టిస్ ఒంటెద్దుపల్లి చిన్నప్పరెడ్డి ఓ గొప్ప న్యాయమూర్తి అని, ఆయన  న్యాయమూర్తులకు, న్యాయవాదులకు స్ఫూర్తిగా నిలిచారని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నాగమోహన్‌దాస్ అన్నారు. ఆయన ఆదివారం నగరంలోని అల్లం సుమంగళమ్మ కళాశాలలో ‘జస్టిస్ చిన్నప్పరెడ్డి ఎ లెజెండ్’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం మాట్లాడారు .జస్టిస్ చిన్నప్పరెడ్డి ఇచ్చిన తీర్పులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. భారత న్యాయ వ్యవస్థలో చిన్నప్పరెడ్డి ఇచ్చిన తీర్పులను అన్ని వర్గాల ప్రజలు హర్షించారన్నారు. దేశ, విదేశాల్లో కూడా జస్టిస్ చిన్నప్పరెడ్డి తీర్పులను గౌరవించారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తిగా కూడా పని చేశారని, ఆయన తీర్పులు విభిన్నంగా ఉండేవని గుర్తు చేశారు. జస్టిస్ చిన్నప్పరెడ్డి అడుగు జాడల్లో న్యాయమూర్తులు నడవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తిగా ఉంటూ సమాజసేవ కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని, భూమి, ఆకాశం ఉన్నంత వరకు చిన్నప్పరెడ్డి పేరు న్యాయవ్యవస్థలో మరిచిపోలేమన్నారు.
  చిన్నప్పరెడ్డి పేరు మీద పుస్తకం విడుదల చేశారంటే ఆయన చేసిన గొప్ప పనులేమిటో ఇట్టే అర్థం అవుతుందన్నారు.
 
 లెజెండ్ అని పేరు రావడం కష్టమని, అయితే అది చిన్నప్పరెడ్డి లాంటి వారికే సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా  పుస్తకాలను నిరంతరం చదవడం నేర్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయంటే అది విద్యతోనే సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ మంచి మంచి పుస్తకాలు నిత్యం చదువుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుతోపాటు ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, మేధావుల జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలను చదవడం అలవాటు చేసుకుంటే అది వారి జీవితంలో మార్పు రావడానికి దోహదం చేస్తుందన్నారు. పుస్తకాలు చదవడంతో మన సంస్కృతి, వారసత్వాలను కూడా కాపాడుకోవడానికి వీలవుతుందన్నారు. భారతదేశంలో ప్రజాప్రభుత్వ వ్యవస్థ బలంగా ఉండటానికి ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ బలంగా ఉండటమే ప్రధాన కారణమన్నారు.
 
  దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ జస్టిస్ ఒంటెద్దుపల్లి చిన్నప్పరెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గాను, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో న్యాయమూర్తిగా పని చేశారని కొనియాడారు. తరిమెల మెమోరియల్ ట్రస్టు సమాజ సేవ కోసం పాటుపడుతోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోన్యాయమూర్తులు విశ్వేశ్వరభట్, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టీ.నారాయణస్వామి, బళ్లారి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పాటిల్ సిద్ధారెడ్డి, సీఏ సంస్థల అధ్యక్షుడు రాజశేఖర్, వీవీ సంఘం అధ్యక్షుడు అల్లం గురు బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement