తొమ్మిదేళ్ల తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రే రోడ్‌లో ఎట్టకేలకు ‘బ్రిటానియా పంపింగ్ స్టేషన్’ నిర్మాణాన్ని మంగళవారం చేపట్టింది.
సాక్షి, ముంబై: తొమ్మిదేళ్ల తర్వాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) రే రోడ్‌లో ఎట్టకేలకు ‘బ్రిటానియా పంపింగ్ స్టేషన్’ నిర్మాణాన్ని మంగళవారం చేపట్టింది. ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణంతో వర్షాకాలంలో ఎదురయ్యే వరద నీటి సమస్యను పరిష్కరించవచ్చని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. ముఖ్యంగా వర్షాకాలంలో హిందూ మాతా, ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతుంటారు. ఈ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి రూ.138 కోట్లను వెచ్చించనున్నట్లు అధికారి తెలిపారు. 2005 జూలైలో నగరంలో భారీవర్షాలు కురవడంతో నగరం వరద ముంపునకు గురైంది.
దీంతో ఎనిమిది పంపింగ్ స్టేషన్లను నిర్మించనున్నట్లు బీఎంసీ ప్రకటించింది. ప్రస్తుతం రెండు పంపింగ్ స్టేషన్లు మాత్రమే వినియోగంలోకి రానున్నట్లు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఈ పంపింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అవసరమైన అనుమతులను పొందేందుకు చాలా సమయం వృథా అయిందన్నారు. ఇప్పుడు ఈ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. మరో 18 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు.
ఇదిలా వుండగా, వర్లీలో మరో రెండు పంపింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారి వివరించారు. వీటిలో ‘లవ్‌గ్రోవ్’ స్టేషన్‌కు గాను రూ.102 కోట్లు, ‘క్లైవ్‌ల్యాండ్ బందర్’ పంపింగ్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 116 కోట్ల వ్యయం కానుంది. 2013 అక్టోబర్‌లో ఇవి పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ వర్షాకాలంలో వీటిని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని వర్షపు వరద నీరు చీఫ్ ఇంజనీర్ లక్ష్మణ్ వట్కర్ తెలిపారు.
నగర శివారు ప్రాంతాల్లో మూడు పంపింగ్ స్టేషన్లను నిర్మించే విషయమై ప్రతిపాదించినప్పటికీ అవి కాగితాల వరకే పరిమితమై ఉన్నాయి. వీటిలో ఖార్ పంపింగ్ స్టేషన్‌కు గాను ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉండగా, మహుల్, శాంతాక్రజ్‌లలో ఏర్పాటు చేయనున్న పంపింగ్ స్టేషన్లను వివిధ కారణాల వల్ల ‘మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ తిరస్కరించిందని లక్ష్మణ్ తెలిపారు.