వ్యాపారులతో ఎస్‌బీఐ అధికారుల కుమ్మక్కు

వ్యాపారులతో ఎస్‌బీఐ అధికారుల కుమ్మక్కు - Sakshi


ఒకేరోజు రూ. 2.49 కోట్లు..

నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్‌ నుంచి విత్‌డ్రా

వ్యాపారులతో ఎస్‌బీఐ అధికారుల కుమ్మక్కు

ప.గో. జిల్లా తణుకులో బయటపడిన నిర్వాకం

ఏజీఎంసహా ఐదుగురు ఉద్యోగులు,

మరో 9 మందిపై సీబీఐ కేసు

నిందితుల ఇళ్లల్లో సోదాలు..

రూ.2.11 లక్షలు స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో ఉన్న నగదును విత్‌డ్రా చేసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు, పరిమితులతో దేశవ్యాప్తంగా జనం అల్లాడారు. కానీ ఆ వ్యాపారులకు అలాంటి నిబంధనలు, పరిమితులు అడ్డురాలేదు. బ్యాంకు అధికారుల సహకారంతో ఒకేరోజు ఏకంగా రూ. 2.49 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ ఉదంతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో చోటు చేసుకుంది. కొందరు వ్యాపారులతో బ్యాంకు అధికారులు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా విత్ర్‌డాకు సహకరించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐ పసిగట్టింది. తప్పుచేసిన ఐదుగురు బ్యాంకు అధికారులతోపాటు 8 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసింది. వివరాల్ని సీబీఐ ఎస్పీ ఆర్‌.గోపాలకృష్ణ బుధవారం వెల్లడించారు.కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక నగదు ఉపసంహరణపై కొన్ని పరిమితులు విధించడం తెలిసిందే. అయితే తణుకు ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ ఏజీఎం కె.వి.కృష్ణారావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌.బాలాజీ, డిప్యూటీ మేనేజర్లు జి.ఇజ్రాయిల్‌రాజు, ఎల్‌.వి.నవీన్, రామచంద్రరాజులు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. డబ్బు ఆశతో అడ్డదారి తొక్కారు. శ్రీ రామకృష్ణ రా అండ్‌ పార్‌బాయిల్డ్‌ రైస్‌మిల్, పట్టాభి ఆగ్రో ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, విజయశ్రీ ఫుడ్స్, గౌతమ్‌ కన్‌స్ట్రక్షన్స్, మహేశ్వరి కోకోనట్‌ కంపెనీ, రవళి స్పెన్సర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఇండియన్‌ హెయిర్‌ లిమిటెడ్, హేమాద్రి రైస్‌మిల్, నిషి ఎగ్‌ పౌల్ట్రీ ప్రొడక్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు చెందిన రూ.2.49 కోట్ల ధనాన్ని ఒక్కరోజులో విత్‌డ్రా చేయించారు. విషయం సీబీఐకి చేరడంతో ప్రాథమిక విచారణ జరిపి నిర్ధారించుకున్నారు. అనంతరం మొత్తం 14 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల నివాసాల్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు, రూ.2.11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరేగాక మరికొందరు ప్రభుత్వాధికారులూ నిబంధనలకు విరుద్ధంగా ఇదే బ్రాంచ్‌లో నగదు ఉపసంహరణ చేసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లోతుగా విచారణ జరుపుతోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top