
రెండోరోజూ ఏడున్నర గంటల విచారణ
తునిలో కాపు ఐక్యగర్జన సమావేశం సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు రెండోరోజు బుధవారం దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించారు.
తునిలో కాపు ఐక్యగర్జన సమావేశం సందర్భంగా జరిగిన హింసాకాండ నేపథ్యంలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ఏపీ సీఐడీ పోలీసులు రెండోరోజు బుధవారం దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించారు. ఉదయం 11.30 గంటలకు విచారణకని లోపలకు తీసుకెళ్లిన పోలీసులు.. రాత్రి ఏడు గంటల వరకు ఆయనను లోపలే ఉంచారు. అయితే అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టారని, ఘటనతో ఏమాత్రం సంబంధం లేని తనను వాళ్లు ప్రశ్నించడానికి.. ఆ ఘటన జరిగిన రోజున చంద్రబాబు చేసిన ప్రకటనే కారణమని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మరోవైపు రాత్రికి రాత్రే భారీగా పోలీసు బలగాలను గుంటూరుకు తరలించడంతో భూమనను అరెస్టు చేస్తారన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో జరిగే విచారణకు రావాలంటూ ఇటీవలే సీఐడీ అదనపు ఎస్పీ భూమనకు నోటీసులు జారీచేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజు రాలేనని, మంగళవారం విచారణకు హాజరవుతానని భూమన పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు భూమనను తొలిరోజు మంగళవారం, తర్వాత మళ్లీ బుధవారం ఏపీ సీఐడీ పోలీసులు విచారించారు.