ఎంఎన్‌ఎస్ కార్యదర్శి అతుల్ కన్నుమూత | Sakshi
Sakshi News home page

ఎంఎన్‌ఎస్ కార్యదర్శి అతుల్ కన్నుమూత

Published Fri, Dec 27 2013 10:56 PM

Atul Sarpotdar leader of Maharashtra Navnirman Sena died

సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) కార్యదర్శి అతుల్ సర్‌పోత్దార్ కన్నుమూశారు. గురువారం రాత్రి గుండె పోటు రావడంతో ఆయనను బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.  చికిత్స కొనసాగిస్తుండగానే రాత్రి సుమారు 7.30 గంటలకు ఆయనకు మరోసారి గుండెపోటు వచ్చి తుదిశ్వాస విడిచారు. 51 ఏళ్ల అతుల్‌కు భార్య శిల్పా, కుమారుడు జయ్ ఇలా ఉన్నారు. అతుల్ చనిపోయిన విషయం తెలియగానే ఆయన భార్య శిల్పా దిగ్భ్రాంతికిలోనయింది. ఆమెకు కూడా లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స నిర్వహిస్తున్నారు. అతుల్ చనిపోయిన విషయం తెలియగానే రాజ్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, పదాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు.

శివసేన నాయకులు దివంగత మధుకర్ సర్‌పోత్దార్ కుమారుడు అతుల్ ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు. రాజ్‌ఠాక్రే శివసేన వదిలిన తర్వాత అతుల్ కూడా ఆయన బాటలో వెళ్లి ఎంఎన్‌ఎస్‌లో చేరారు. ఎంఎన్‌ఎస్ స్థాపించినప్పటి నుంచి అతుల్ రాజ్‌తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. వ్యక్తిగతంగా అతుల్ సౌమ్యుడనే గుర్తింపు ఉంది. అతుల్ మరణ వార్తతో ముంబైతో పాటు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లోని కార్యకర్తలందరూ ఖిన్నులయ్యారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శన కోసం శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు అతుల్ భౌతికకాయాన్ని ఖేర్వాడిలోని వినాయక్ కాలనీలో ఉంచారు.  మధ్యాహ్నం ఖేర్వాడిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు రాజ్ ఠాక్రే హాజరయ్యారు.
 పెళ్లి విడిచి వచ్చిన రాజ్‌ఠాక్రే........
 అతుల్ సర్‌పోత్దార్ లీలావతి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాజ్ ఠాక్రే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్కీకర్ కుమారుడి వివాహ కార్యక్రమంలో ఉన్నారు. అయితే లీలావతి ఆస్పత్రి నుంచి అతుల్ చనిపోయారన్న సమాచారం తెలియగానే ఆయన వెంటనే ముంబైకి బయల్దేరి వచ్చారు. అతుల్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.

Advertisement
Advertisement