
ఆరుగంటల పాటు భూమన విచారణ!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.
కాపు రిజర్వేషన్ల కోసం గడిచిన ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఐక్య గర్జన ఆందోళన కార్యక్రమం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో చోటుచేసుకున్న విధ్వంసకర ఘటనలపై ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగానే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను టార్గెట్ చేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు.
తునిలో రైలు బోగీల తగులబెట్టిన సంఘటన జరిగిన వెంటనే అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, ఎలాంటి ఆధారాలు చూపకుండానే ఆ ఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చేయించారంటూ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి ఈ ఘటనల వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ నేతల హస్తం ఉందంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలా ప్రకటించినట్టుగానే ఒక్కొక్కరిగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా ఆ చర్యలను ముమ్మరం చేసినట్టు స్పష్టమవుతోంది.
మంగళవారం ఈ కేసుకు సంబంధించి వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సీఐడీ పోలీసులు దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో జరిగే విచారణకు రావాలంటూ ఇటీవలే సీఐడీ అదనపు ఎస్పీ భూమనకు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆ రోజున హాజరుకాలేననీ, మంగళవారం విచారణకు హాజరవుతానని భూమన ఇదివరకే పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు భూమన మంగళవారం ఉదయం 11.30 గంటలకు గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకోగా అప్పటి నుంచి సాయంత్రం దాదాపు 6 గంటల వరకు ఆ కార్యాలయంలో ఉంచి సీఐడీ అధికారులు విచారించారు.