అళగిరి కొత్త అడుగు | Alagiri new step in tamil nadu politics | Sakshi
Sakshi News home page

అళగిరి కొత్త అడుగు

Sep 16 2015 8:38 AM | Updated on Sep 3 2017 9:31 AM

అళగిరి కొత్త అడుగు

అళగిరి కొత్త అడుగు

డీఎంకేలో మరో మారు ప్రకంపన సృష్టించే విధంగా బహిష్కృత నేత అళగిరి అడుగులు వేస్తున్నారు.

చెన్నై : డీఎంకేలో మరో మారు ప్రకంపన సృష్టించే విధంగా బహిష్కృత నేత అళగిరి అడుగులు వేస్తున్నారు. రెండు నెలల్లో సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్టు స్వయంగా అళగిరి వెళ్లడించడం డీఎంకేలో చర్చనీయాంశంగా మారింది. గోపాల పురంలో తనకు అనుమతి కరువు కావడంపై అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. డీఎంకే నుంచి అధినేత ఎం కరుణానిధి తనయుడు అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. మళ్లీ తనను అక్కున చేర్చుకుంటారన్న ఆశ అళగిరిలో ఉన్నా, అందుకు తగ్గ సమయం మాత్రం రావడం లేదు.

అయితే, రాను రాను ఆ ఆశలు అళగిరిలో సన్నగిల్లుతున్నట్టున్నాయి. కొంత కాలంగా వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉన్న అళగిరి మళ్లీ తన విమర్శలు, ఆరోపణాస్త్రాల్ని సంధించే పనిలో పడ్డారు. ప్రధానంగా స్టాలిన్‌కు వ్యతిరేకంగా మళ్లీ విరుచుకు పడే పనిలో పడ్డారు. హాంకాంగ్‌కు వెళ్లే సమయంలో గత వారం స్టాలిన్‌పై తీవ్రంగా స్పందించిన అళగిరి అక్కడి నుంచి మంగళవారం చెన్నై చేరుకోగానే సంచనల వ్యాఖ్య చేసి మదురైకు చెక్కేశారు.
 
అనుమతి కరువు : పార్టీ నుంచి బహిష్కరించినా యథా ప్రకారం తరచూ చెన్నైకు వచ్చినప్పుడల్లా గోపాల పురంకు అళగిరి వెళ్తూ వచ్చారు. అయితే, ఆయనకు అధినేత, తండ్రి కరుణానిధి ప్రసన్నం మాత్రం దక్కడం లేదని చెప్పవచ్చు.  దీంతో తన తల్లి దయాళు అమ్మాల్‌తో మాట్లాడటం, తన ఆవేదనను వెల్గక్కడం మదురైకు వెళ్లి పోవడం చేస్తూ వచ్చారు.

అయితే, విదేశాల నుంచి చెన్నైకు వచ్చిన అళగిరి తనకు ఏదైనా శుభవార్త దక్కుతుందని ఎదురు చూసి భంగ పడక తప్పలేదు. తన తల్లి దయాళు అమ్మాల్‌ను కలుసుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. కరుణానిధి అనుమతి కూడా దక్కక పోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టున్నారు. మదురై వెళ్తూ చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో కొత్త అడుగు వేయబోతున్నట్టు ప్రకటించి విమానం ఎక్కేయడం గమనార్హం.
 
 రెండు నెలల్లో :  అళగిరి విమానాశ్రయానికి రావడంతో మీడియా ఆయన్ను చుట్టుముట్టింది. తన తల్లిదండ్రుల్ని కలిసేందుకు వచ్చానని, వీలు పడక పోవడంతో తిరిగీ వెళ్తున్నట్టు పేర్కొన్నారు. స్టాలిన్‌ను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశానని, అందులో ఎలాంటి మార్పులేదన్నారు. డీఎంకే అంటే కరుణానిధి, కరుణానిధి అంటే డిఎంకే మాత్రమేనని స్పష్టం చేశారు.

ఆయన స్థానంలో మరొకర్ని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. రెండు నెలల్లో కొత్త నిర్ణయం, ప్రకటన వెలువరిస్తానని అంత వరకు వేచి ఉండంటూ, భద్రతా సిబ్బంది సాయంతో మీడియాను దాటుకుంటూ మదురైకు చెక్కేశారు. అయితే, రెండు నెలల్లో అళగిరి ఏ నిర్ణయం వెల్లడించబోతున్నారు.
 
 ఆయన చేయబోయే ప్రకటన ఏమిటీ..? ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనన్న చర్చ డీఎంకేలో బయలు దేరి ఉన్నది. అదే సమయంలో స్టాలిన్ వ్యతిరేక శక్తులు మళ్లీ అళగిరి పక్షాన చేరి, పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా వ్యవహరిస్తారా.? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు ఉదాహరణగా లోక్ సభ ఎన్నికల సమయంలో అళగిరి వ్యవహరించిన తీరు ఓ నిదర్శనం. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అళగిరి రెండు నెలల తర్వాత ప్రకటన ఎలా ఉంటుందోనన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement