
అమెరికాకు అళగిరి పయనం
కొన్నాళ్లు అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణల నుంచి డీఎంకే వర్గాలు తప్పించుకోనున్నాయి.
చెన్నై : కొన్నాళ్లు అళగిరి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణల నుంచి డీఎంకే వర్గాలు తప్పించుకోనున్నాయి. తన చుట్టూ సాగుతున్న తంతును చూసిన అళగిరి, ఇక్కడ ఉండటం కన్నా విదేశాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. ఏప్రిల్ 10న అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.
డీఎంకేలో అధినేత కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి ఎపిసోడ్ గురించి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణాస్త్రల్ని సంధిస్తూ వచ్చిన అళగిరి రెండు రోజుల క్రితం మదురై వేదికగా తన మద్దతుదారులతో భేటీ అయ్యారు. పార్టీ పెట్టబోతున్నట్టు, డీఎంకేను చీల్చనున్నట్టు సాగుతున్న ప్రచారాలకు బ్రేక్ వేస్తూ అళగిరి తన మదిలోని నిర్ణయాన్ని ప్రకటించారు. కరుణానిధిని, డీఎంకేను రక్షించుకోవడం తన లక్ష్యంగా పేర్కొన్నారు.
ఆ మరుసటి రోజే అళగిరి పార్టీ వర్గాలను గందరగోళంలోకి నెట్టే యత్నం చేస్తున్నారని, ఆయనతో జర భద్రం అంటూ డీఎంకే అధిష్టానం కార్యకర్తల్ని హెచ్చరించింది. అదే సమయంలో అళగిరితో మంతనాల్లో బిజిబిజీగా ఉన్న దక్షిణాది జిల్లాలోని పార్టీ నేతలపై డీఎంకే అధిష్టానం కన్నేసింది. వారి వివరాలను, అందుకు తగ్గ ఆధారాల్ని సేకరించి, వారిపై కొరడా ఝుళిపించే వ్యూహంతో ముందుకెళ్తోన్నది. ఈ పరిస్థితుల్లో జర భద్రం అంటూ డీఎంకే అధిష్టానం చేసిన హెచ్చరికకు స్పందించిన అళగిరి, తాను మాత్రం డీఎంకే పక్ష పాతినని చాటుకునే యత్నం చేశారు.
విదేశాలకు
తాను ఇక్కడ ఉండటం వల్లే లేని పోని ఆరోపణలు, ప్రచారాలు సాగుతుండడంతో కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉండేందుకు అళగిరి నిర్ణయిం చినట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. పార్టీకి ఎన్నడూ ద్రోహం తలపెట్టనని అళగిరి స్పష్టం చేశారని, ఇలాంటి సమయంలో మద్దతుదారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనలో పెరిగిందంటున్నారు. ఎన్నికల వేళ తాను ఇక్కడే ఉంటే కొన్ని మీడియాలో పని గట్టుకుని మరీ తానేదో కుట్రలు చేస్తున్నట్టు, అభ్యర్థులను ఓడించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కట్టు కథలు అల్లడం ఖాయం అన్న విషయాన్ని అళగిరి గ్రహించి ఉన్నారు. దీంతో ఇక్కడుండడం కన్నా విదేశాలకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచా రం. పార్టీలో ఉన్న తన మద్దతుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పార్టీ కోసం వాళ్లు పనిచేసే రీతిలో తనంతట తాను కొన్నాళ్లు అందరికీ దూరంగా ఉండేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారు.
10న పయనం
తరచూ అళగిరి అమెరికాకు వెళుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన కుమార్తె ఉన్నారు. ఆమెను చూసేందుకు వెళ్లినప్పుడల్లా నెలల తరబడి అక్కడే ఉండే వారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడే వరకు తమిళనాడు వైపు తొంగి చూడని రీతిలో అమెరికాకు పయనం అయ్యేందుకు సిద్ధం అవుతోన్నారట!. ఏప్రిల్ పదో తేదీన ఆయన అమెరికా పయనం ఉంటుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే రోజు నుంచి మూడు రోజుల పాటుగా మదురైలో తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి ఎన్నికల ప్రచారం నిమిత్తం తిష్ట వేయనుండడం గమనార్హం.
ఇక్కడుంటే కరుణానిధిని పలకరించాల్సి ఉంటుందని, ఇక్కడ జరిగే పరిణామాలన్నింటిని తన మీదే రుద్దే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయంతో కరుణానిధి ఇక్కడికి వచ్చే రోజు ఉదయాన్నే చెన్నై లేదా ముంబై నుంచి అమెరికా వెళ్లడానికి అళగిరి పర్యటన సిద్ధం చేసుకుంటున్నారట! అళగిరి విదేశాలకు వెళ్లే యత్నంలో ఉన్న సమాచారంతో డీఎంకే లోక్ సభ అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నట్టు సమాచారం. ఆయన ఇక్కడుంటే విమర్శలతో తమ గెలుపునకు అడ్డు పడుతారోనన్న బెంగ నుంచి కాస్త ఊరట చెందుతున్నారు.