జయకు పోటీగా 44 మంది | Sakshi
Sakshi News home page

జయకు పోటీగా 44 మంది

Published Tue, May 3 2016 4:37 AM

జయకు పోటీగా 44 మంది

చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉత్కంఠ భరితంగా సాగుతున్న తమిళనాడు ఎన్నికల రణరంగంలో 3800 మంది పోటీకి నిలిచారు. మొత్తం 234 స్థానాల్లో 3800 మంది తలపడుతున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గత నెల 22వ తేదీన మొదలైన నామినేషన్ల ఘట్టంలో 234 స్థానాలకు 7156 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 30వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగగా 2975 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 4181 నామినేషన్లు అర్హత పొందాయి. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ అంకం ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది.

పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు, వారి డమ్మీ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అలాగే ప్రధాన పార్టీల్లో సైతం డమ్మీ అభ్యర్థులు అసలు అభ్యర్థులుగా మారిపోయారు. మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఉపసంహరణల అంకంతో బరిలో నిలిచే అభ్యర్థులు ఎందరో తేలిపోయింది. 300 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మొత్తం 234 స్థానాలకు 3800 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీచేస్తున్న ఆర్కేనగర్‌లో 45 మంది, డీఎంకే అధినేత పోటీపడుతున్న తిరువారూరులో 15 మంది, డీఎండీకే అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి విజయకాంత్ రంగంలో ఉన్న ఉళుందూర్‌పేటలో 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే చెన్నైలోని 16 నియోజకవర్గాల నుంచి 378 మంది తలపడుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement