భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ హాజరు కానున్నారు.
ముంబై: భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ చైర్మన్ ఎన్. శ్రీనివాసన్ హాజరు కానున్నారు. ఆయనతో పాటు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుధ్ చౌదరి కూడా సెమీస్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తారు. శ్రీని ఐసీసీ చైర్మన్ హోదాలోనే వరల్డ్ కప్‌కు వెళుతుండగా... బీసీసీఐ ప్రతినిధులుగా ఠాకూర్, చౌదరి హాజరవుతారు. అయితే బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మాత్రం ఆరోగ్య కారణాలతో సిడ్నీకి వెళ్లడం లేదు. సుదీర్ఘ సమయంపాటు ఆయన విమాన ప్రయాణం చేయలేరని, అందుకే వెనక్కి తగ్గారని సమాచారం.
పెరిగిన చార్జీలు...
ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ చేరడంతో ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానాల చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. భారత్‌లోని ప్రధాన నగరాల నుంచి సిడ్నీ లేదా మెల్‌బోర్న్ వెళ్లే ఫ్లయిట్‌లలో దాదాపు 20 శాతం వరకు చార్జీలు పెంచారు. ఉత్తరాదితో పోలిస్తే హైదరాబాద్, బెంగళూరుల నుంచి ఇది మరి కాస్త ఎక్కువగా ఉందని పేర్కొన్న ఎయిర్‌వేస్ రంగ నిపుణలు...భారత్ ఫైనల్ చేరితే టికెట్లు దొరకడమే గగనంగా మారవచ్చని వెల్లడించారు.