ICC Chairman: బరిలో గంగూలీ, జై షాతో పాటు కేంద్ర మంత్రి..!

Anurag Thakur In ICC Chairman Race - Sakshi

Anurag Thakur In ICC Chairman Race: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) చైర్మన్‌గా గ్రెగ్‌ బార్ల్కే (న్యూజిలాండ్‌) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి కోసం ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. క్రికెట్‌కు సంబంధించి అత్యున్నతమైన ఈ పదవిని దక్కించుకునేందుకు బీసీసీఐ బాస్‌ సౌరవ్‌ గంగూలీ, ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తనయుడు జై షా సహా ఓ కేంద్ర మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఐసీసీ చైర్మన్‌ గిరికి అర్హత సాధించగా.. బీసీసీఐ బాస్‌ హోదాలో గంగూలీ, ఐసీసీ ఆఫీస్‌ బేరర్‌గా జై షా సైతం ఈ పదవికి అర్హత కలిగి ఉన్నారు. 

ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకునేందుకు గంగూలీ ముందు నుంచే పావులు కదపగా..  తాజాగా జై షా, అనురాగ్‌ ఠాకూర్‌ సైతం ఐసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్‌ ఐసీసీ చైర్మన్‌ హోదాలో పని చేశారు.
చదవండి: రెచ్చిపోయిన హ‌నుమ విహారీ.. సెంచరీ, హాఫ్‌ సెంచరీ సహా 216 పరుగులు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top