సర్ఫరాజ్‌ భయపడ్డాడా?

Why Sarfraz Ahmed Batted at Lower Order - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌పై ఘోర పరాజయం తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. ఇక పాక్‌ అభిమానులైతే పిజ్జాలు, బర్గర్‌లు తింటూ పొట్ట బాగా పెంచావే కానీ ఆటపై ఏకాగ్రత లేదంటూ మండిపడ్డారు. అయితే భారత్‌తో మ్యాచ్‌ తర్వాత పాకిస్తాన్‌.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.  హరీస్‌ సోహైల్‌(89; 59 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు‌), బాబర్‌ అజామ్‌(69), ఇమాముల్‌ హక్‌(44), ఫకార్‌ జమాన్‌(44)లు రాణించడంతో ఆ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అంతవరకూ బాగానే ఉంది.. కానీ పాక్‌ కెప్టెన్‌ సర్పరాజ్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (ఇక్కడ చదవండి: చెలరేగిన సొహైల్‌..)

పాక్‌ టాపార్డర్‌ ఆటగాళ్లలో పలువురు మెరుగైన ప్రదర్శన కనబరిచి మంచి స్కోరుకు బాటలో వేసిన సమయంలో సర్ఫరాజ్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ దిగడం పాక్‌ అభిమానులను ఆలోచింపజేస్తోంది. సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ దిగే సర్పరాజ్‌ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ రావడమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. బ్యాట్స్‌మన్‌ అయిన సర్ఫరాజ్‌ కింది వరుసలో బ్యాటింగ్‌ చేయడమేంటనేది సగటు క్రీడాభిమానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఇమాద్‌ వసీం ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు వస్తాడని అనుకున్నారంతా. 48 ఓవర్‌ చివరి బంతికి ఇమాద్‌ వసీం ఔట్‌ కాగా అప్పటికి పాక్‌ స్కోరు 295. ఆ సమయంలో వహాబ్‌ రియాజ్‌ బ్యాటింగ్‌కు దిగాడు.  ఇక్కడ వహాబ్‌ విఫలమయ్యాడు.

ఇంకా రెండు ఓవర్లు ఉన్న సమయంలో సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు రాకుండా వహాబ్‌ను దింపడం ఆలోచనలో పడేసింది. అప్పుడు సర్పరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే పాక్‌ స్కోరు మరింత పెరగడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెనక్కి పోవడంతో మరోసారి విమర్శలకు బాట వేసినట్లే కనిపిస్తోంది. అసలు సర్పరాజ్‌ బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధం కాలేదా లేక హిట్టింగ్‌ చేయలేక భయపడ్డాడా అనేది అతనికే తెలియాలి. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న సర్పరాజ్‌ రెండు పరుగులే చేసి అజేయంగా నిలవడం గమనార్హం. ఇక్కడ సర్పరాజ్‌ అహ్మద్‌ స్టైక్‌రేట్‌ వంద ఉంది..ఒకవేళ మ్యాచ్‌లో ఫలితం తేడా వస్తే అతన్ని మాటలతో ఉతికి ఆరేసే స్టైక్‌రేట్‌ కూడా వందకు పోవడం ఖాయం. ఇది పాక్‌కు కీలక మ్యాచ్‌. ఆ జట్టు సెమీస్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top