దాదా అధ్యక్షుడైతే రవిశాస్త్రి పరిస్థితేంటి?

What Will Happen To Ravi Shastri After Ganguly BCCI President Asks Netizens - Sakshi

సాక్షి, ముంబై: టీమిండియా మాజీ సారథి,  క్రికెట్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌(క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షపదవికి నామినేషన్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి కోసం మరెవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఏకగ్రీవంగా గంగూలీ ఎంపిక పూర్తయినట్లే. దీంతో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా గంగూలీకి ఎదురయ్యే సవాళ్లు.. చేయబోయే సంస్కరణలపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక లాంఛనమైన తరుణంలో ఓ ఆసక్తికర చర్చను నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు. 

టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి గంగూలీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉన్న విషయం తెలిసిందే. 2016లో టీమిండియా కోచ్‌ పదవికి తనను రిజెక్ట్‌ చేయడానికి గంగూలీనే ప్రధాన కారణమని రవిశాస్త్రి ఎన్నో సార్లు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలకు దిగాడు. అయితే రవిశాస్త్రి విమర్శలపై ఇప్పటివరకు గంగూలీ సైలెంట్‌గానే ఉన్నాడు. అయితే గంగూలీ రవిశాస్త్రిపై రివేంజ్‌ తీసుకునే సమయం వచ్చిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రవిశాస్త్రి భవితవ్యం ఏంటని నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు. తనకు శత్రువులైన వారందినినీ తొలగించి.. దాదా తన కొత్త  గ్యాంగ్‌ ఏర్పరుచుకుంటాడు అని మరి కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి ఫన్నీ మీమ్స్‌ను రూపొందించి నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. 
 

అసలేం జరిగిందంటే..
2016లో టీమిండియా కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో కూడిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది. దీనిలో భాగంగా ఈ కమిటీ అభ్యర్థులకు ఇంటర్య్వూలను ఏర్పాటు చేసింది. అయితే రవిశాస్త్రి స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనడాన్ని లక్ష్మణ్‌, సచిన్‌లు స్వాగతించగా.. గంగూలీ మాత్రం తీవ్రంగా తప్పుబట్టాడు. కోచ్ పదవీ అంటే ఆషామాషీ కాదని.. కనీసం ఇంటర్వ్యూకు వచ్చే తీరిక కూడా లేని వ్యక్తిని కోచ్‌గా ఎందుకు ఎంపిక చేయాలనే వాదనను గంగూలీ గట్టిగా వినిపించాడు. 

అంతేకాకుండా అనిల్‌ కుంబ్లేను  కోచ్‌గా ఎంపిక​​ చేయాలని పట్టుబట్టి ఇతర కమిటీ సభ్యులను ఒప్పించాడు.  అయితే తనకు కోచ్‌ పదవి రాకుండా గంగూలీనే అడ్డుకున్నాడని రవిశాస్త్రి బహిరంగంగా ఎన్నో సార్లు విమర్శించాడు. అయితే కుంబ్లే రాజీనామా అనంతరం సీఏసీ రవిశాస్త్రినే తిరిగి కోచ్‌గా ఎంపిక చేసింది. ఆ సమయంలో కూడా రవిశాస్త్రి ఎంపిక పట్ల గంగూలీ ఆసక్తి చూపలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో బెటర్‌ ఆప్షన్‌ రవిశాస్త్రినే కావడంతో చేసేదేమి లేక అతడినే కోచ్‌గా ఎంపిక చేయడంతో కథ సుఖాంతమైంది. అంతేకాకుండా వీర్దిద్దరి మధ్య వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top