జాఫర్‌ 285 బ్యాటింగ్‌ | Sakshi
Sakshi News home page

జాఫర్‌ 285 బ్యాటింగ్‌

Published Fri, Mar 16 2018 2:28 AM

Wasim Jaffer Scales New Peak, Slams Highest Score in Irani Cup - Sakshi

నాగ్‌పూర్‌ : ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెండో రోజు కూడా వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ జోరు కొనసాగింది. జాఫర్‌ (425 బంతుల్లో 285 బ్యాటింగ్‌: 34 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత డబుల్‌ సెంచరీతో రెస్టాఫ్‌ ఇండియాతో జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో గురువారం ఆట ముగిసేసరికి విదర్భ 3 వికెట్ల నష్టానికి 588 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ గణేశ్‌ సతీశ్‌ (280 బంతుల్లో 120; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌పై తొలి రోజు 2 వికెట్లు తీసిన రెస్టాఫ్‌ ఇండియా రెండో రోజు కూడా 90 ఓవర్ల పాటు శ్రమించినా ఒక వికెట్‌ మాత్రమే పడగొట్టగలిగింది. ప్రస్తుతం జాఫర్‌తో పాటు అపూర్వ్‌ వాంఖడే (44 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు.  

ఓవర్‌నైట్‌ స్కోరు 289/2తో విదర్భ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఆరంభంలో రెస్టాఫ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో తొలి తొమ్మిది ఓవర్లలో ఎనిమిది పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో జాఫర్, సతీశ్‌ అలవోకగా పరుగులు సాధించారు. అశ్విన్‌ కొన్ని సార్లు వీరిద్దరిపై ఒత్తిడి పెంచగలిగినా వికెట్‌ మాత్రం దక్కలేదు. లంచ్‌ సమయానికి విదర్భ స్కోరు 407/2 కాగా...టీ విరామానికి అది 504కు చేరింది. ఈ క్రమంలో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో జాఫర్‌ ఎనిమిదో డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకోగా... సతీశ్‌ 12వ శతకం సాధించాడు. ఎట్టకేలకు మూడో సెషన్‌లో ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని ఆడబోయి సతీశ్‌ వికెట్‌ కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో 289 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం 250 పరుగుల మైలురాయిని కూడా దాటిన జాఫర్‌ ఇరానీ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మురళీ విజయ్‌ (266) రికార్డును కూడా అధిగమించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 40 ఏళ్ల వయసులో ఒకే ఇన్నింగ్స్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ, ఆసియా క్రికెటర్‌ జాఫర్‌. 

Advertisement
Advertisement